Tuesday, July 29, 2014

మామిడి కాయ మహారాణి......కీరా రాకుమారి సంవాదం; కామాక్షి కబుర్లు


కూరలు పళ్ళు తమలో తాము వాదించుకుంటాయా? మీరెప్పుడైన, ఎక్కడైనా విన్నారా? ఇదెక్కడి చోద్యం అనుకోకండి! ఇది చదివేక మీరు ఒప్పు కోక తప్పదు. ‘మామిడికాయ మహారాణి, కీర రాకుమారి’  అద్భుత సంవాదం లో మరి ఎవరు గెలిచారు, ఎవరు వోడేరు తెలుసుకోవాలంటే, ఈ రోజు ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకు వచ్చిన ఈ కామాక్షి చెప్పే కధ చదివి తీరాలి. అద్భుతమైన సృజనాత్మకతో, కడుపుబ్బ నవ్వించే హాస్య సంభాషణలతో ఆద్యంతం సాగే ఈ కామాక్షి చెప్పిన కథ చదివిన తరువాత మీ తీర్పు ఎవరి పక్షాన ఉందొ తెలుపగలరు.


సంపాదకుడు





మామిడి కాయ మహారాణి......కీరా రాకుమారి సంవాదం

శ్రీమతి రత్నాశ్రీనివాస్, బెంగళూరు


 ప్రతి బుధవారం ఉదయం, కామాక్షి ఇంటి దగ్గర వున్న కూరల దుకాణంలో ఫ్రెష్ గా తోపుడు బండిలో కూరలు వస్తుంటాయి. భర్త విశ్వనాథం, బాబిగాడు; ఆఫీసు,స్కూల్ కి వెళ్ళగానే కామాక్షి గబా గబా తెమిలి కూరలు తెచ్చుకోవటానికి   వెళుతుంది. ముందు వెళితే తాజావి ఏరుకోవచ్చు మరి. లేదంటే  ఇల్లాళ్ళంతా వచ్చి లేతగా వున్న కాయ గూరలన్నీ ఏరేసుకుని ముచికలు విరిచేసిన ముదురు బెండ కాయలు, పుచ్చు వంకాయలే మిగుల్చుతారు. అందుకే కామాక్షి ఆదరా బాదారగా బయలుదేరింది. ఎలాగో ఇవాళ తనే ముందు వెళ్ళింది. చక చక నవనవ లాడుతూ లేతగా వున్న కూరలన్నీ ఏరుకుని తూకం వేయించుకుంది. ఇంకా ఏమి తీసుకుందామా అని ఆలోచనలో పడింది. అక్కడ ఒక పక్కగా వెదురు గంపలో  కోలగా  ఉండి  పచ్చగా మెరిసిపోతున్న మామిడికాయలు, పక్క గంపలో లావుగా, పొడుగ్గా ఉండి, లేతాకు పచ్చ రంగులో వున్న కీరలు (దోసకాయ) వున్నాయి.

మామిడి కాయ, పక్క గంపలో వున్న కీరతో  "చూడు ఆ ఆంటీ నన్నే తీసుకుని సంచిలో వేసుకుంటుంది" అంది గర్వంగా.  

వెంటనే కీర "ఏం! ఎందుకని అలా చెప్పగలుగుతున్నావు?నన్ను కూడా కొనవచ్చుగా" అంది.

“ఆ...... నీరుగారి పోయే మొహాన్ని ఎవరు కొంటారు" అంది మామిడి.

“చాల్లే పెద్ద చెప్పొచ్చావు! ఇది వేసవి కాలం. ఎండ తాపం తీర్చేది నేనే. ఈ వేసవి కాలం   కూడలి లో చూసినా బళ్ల నిండా నేనే కనిపిస్తాను. మధ్యాహ్నాలు ఎంత మంది బళ్ల దగ్గర మూగి, అందంగా తరిగిన ముక్కలను తిని సేద తీరటం లేదు? నీరు కారుతాను కాబట్టే ఎండకు నీరెండి పోయిన శరీరాలకి ఊరట కలిగిస్తునాను”  అంది కీర.

“వేసవి కాలం నేను మాత్రం విరివిగా దొరకనా? అసలు వేసవి కాలమే నా సీజన్. ఆ మాట కొస్తే వేసవి నంతా నేనే పరిపాలిస్తాను. ఊరగాయలు ఎపుడు పెడదామా అని ఇల్లాళ్ళు అంత తహతహ లాడుతూ నా కోసం ఎదురు చూస్తుంటారు. పెట్టాలె కాని ఒక్కటేమిటి?  ఆవకాయ, మాగాయ, మెంతికాయ, పులిహారావకాయ, బెల్లపు ఆవకాయ....ఇల్లాళ్ల కి నాతో ఒక క్షణం తీరికే వుండదు. మడి కట్టుకుని మరీ అందమైన జాడీల్లో నన్నుపెట్టి వాసెన కట్టి ఇల్లాళ్ళు మురిసిపోతుంటే, ఇంకో పక్క ఇంటిల్లి పాది ఆప్యాయంగా వేసుకుని తింటూ వుంటే నిజంగా నా జన్మ సార్ధకమైంది అని అనిపిస్తుంటుంది.” అంది పొంగిపోతూ  మామిడి.

“నేను కూడా ఎమీ తక్కువ కాదే? నువ్వు ఒక్క వేసవి లోనే లభ్యమవుతావు. నేనైతే మూడొందల అరవై ఐదు రోజులు అందుబాటులో వుంటాను. పైగా ఇపుడు అందరు భోజనానికి ముందు సలాడ్ అంటూ నా తోనే ఆరంభిస్తున్నారు. అదీకాక ధర విషయంలో చూసుకుంటే సామాన్య మానవుడికి కూడా అందుబాటులో వుంటాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సాదా బండి నుండి స్టార్ హోటల్ వరకు ఎక్కడ చూసిన నేనే దర్శనమిస్తుంటాను”  గర్వంగా అంది కీర.

“నా మొహం! ఆడవాళ్ళు కూడా మొగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయటం వలన తీరిక లేక, ఆరోగ్యం శీర్శికలు అవి చదివి, ఎక్కవ శ్రమ ఉండదు కదా అని సలాడ్స్ తిని కడుపు నింపుకుంటున్నారు” అక్కసుగా అంది మామిడి.

“నువ్వు ఎన్నైనా చెప్పు! పూర్వం ముచ్చట పడి ఆవకాయలు, మాగాయలు వేసుకునే వారేమో కాని , ఇపుడు ప్రజల్లో ఆరోగ్యాన్ని గురించిన అవగాహన పెరిగి ఊరగాయలు తినటం తగ్గించేసేరు.  బీపీ ఉన్న  వాళ్ళు నిన్ను చూసి బెంబేలెత్తి పోతున్నారు. కొందరు నీ పుల్ల మాగాయికి  అసిడిటీ వచ్చిందంటూ ఏవగించుకుంటున్నారు. ఇంకొందరు వేడిచేసిందంటూ నీ కేసి ఉరిమి ఉరిమి చూస్తున్నారు. మరి కొంతమంది నిన్ను చూస్తేనే చాలు అల్సర్   వస్తుంది బాబోయి అని అరుస్తున్నారు. ఇక మొలలతో బాధపడే వారు సరే సరి నిన్ను చూసి పుంజాలు తెంపుకుని పారిపోతున్నారు. ఇన్ని మాటలెందుకు? నిన్ను తిని అనారోగ్యం పాలైన వారికి నేనే  ఇపుడు పెద్దదిక్కునై ఆదు కుంటున్నాను” అంది కీర తనో పెద్ద ఆపద్భాందవుడిలా.

“ఇంక  తగ్గు తగ్గు! ‘పేను కి పెత్తనం ఇస్తే తల అంతా గోరికిందిట’  అలా వున్నాయి నీ ప్రగల్భాలు. ఎవరో నలుగురైదుగురు మానేసినంత మాత్రాన మిగతా దేశం గొడ్డు పోయిందా ఏమిటి? సుబ్బరంగా లీక్    ప్రూఫ్ ప్యాకింగులు చేయించుకుని మరీ అమెరికా పట్టుకు పోతున్నారు” ఆవేశంగా అంది మామిడి.

“ఆ...ఆ భాగవతాలు  కూడా అయ్యేయిగా....పట్టుకెల్లిన ప్యాకింగ్ లు ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఝడుసుకుని అక్కడ డస్ట్ బిన్ లలో పడేసిన  సంఘటనలు లేకపోలేదు” దేప్పింది కీర.

“నువ్వెప్పుడూ ఇంతే...ఏవో ఒకటి, రెండు ఇన్సిడెంట్స్ జరిగితే దాన్ని మరీ చిలవలు పలవలు చేసి మాట్లాడుతావు. ఐన ఇక్కడ నుండి దేశ దేశాలకి ఎగుమతి చేసి పంపటంలేదా? అక్కడ తిండ్ల కి జిహ్వ చచ్చి ఆవకాయ ముక్క ఉందా అంటూ ఇండియన్ స్టోర్స్ లలో బారులు తీరి మరీ కొనుక్కుని పట్టుకుపోవటం లేదా?”  చెప్పుకుపోతోంది  మామిడి.

“దేశ విదేశాల ప్రసక్తి వచ్చింది కాబట్టి చెపుతున్నాను. నేను అన్ని అమెరికన్ స్టోర్స్ లోను కనిపిస్తూ వుంటాను. క్రోగెర్, వాల్ మార్ట్, మాయెర్... ఎక్కడికెళ్ళినా, ఒక్క స్టోర్స్ ఏమిటి? రెస్టారెంట్స్ లో కూడా కనిపిస్తాను. విదేశీయులు మరీ ఇష్టంగా కూడా తింటారు. నన్ను వెనిగర్  లో ముంచి  పికిల్ చేస్తే పిల్లల నుండి పెద్దల దాక  సవర్ పికిల్, సవర్ పికిల్ అంటూ  చప్పరిస్తూ మరీ తింటారు”. నువ్వే కాదు నేను కూడా విదేశాలు తిరిగాను అన్నట్లుగా  అంది కీర.

“సరే ! ఊరగాయ మాట పక్కన పెట్టు. నేను పండితే, అబ్బ! ఎంత బావుందో పండు అని పెరుగన్నంలో ముక్కలు కోసుకుని తినటం లేదా? చెరకు రసాలు అంటూ రసం పిండుకుని మరీ తాగుతారు. మాంగో మిల్క్ షేక్ అని లస్సీ అనీ రకరకాలుగా తయారు చేసి అమ్ముతున్నారు, కడుపులో చల్లగా పడటం కోసం. నేను ఎక్కడికెళ్ళినా, ఏ రూపంలో నైన మహారాణి గానే వుంటాను. పెళ్ళిళ్ళ లలో మగ పెళ్లి వారు మామిడి కాయ పప్పు కంపల్సరీ అంటారు. ఎంతైనా నాది మహర్జాతకం. నీకు ఎంత పోపు పెట్టిన దండుగ. అంటనే అంటదూ..” హేళనగా అంది మామిడి. 

కీరకి ఒళ్ళు మండిపోయి "పోవే టెంక మొహమా! పోపు పెట్టిన్చుకోవలసిన అవసరం నాకేమి లేదు. పై పై మెరుగులు, అదనపు ఆకర్షణలు అంత కన్నాఅవసరం  లేదు. నేను సౌందర్యానికి ప్రతీక నంటూ, బ్యూటీ పార్లర్స్ వాళ్ళు, నన్ను  చక్రాలుగా కోసి కళ్ళ మీద పెట్టుకోండి అని సౌందర్య చిట్కాలు ఇస్తున్నారు. ఐన నీతో నాకేమిటి మాటలు? నువ్వెన్ని అనుకున్న నా విలువ ఏమిటో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, నువ్వు మహా ముసలిరాణి వైతే, నేను అందాల రాకుమారిని”  అని గిరుక్కున మొహం పక్కకి తిప్పుకుంది.


ఇంకా ఏమి కూరలు కొనాలా అని ఆలోచిస్తున్న కామాక్షి వెనుకకి తిరిగి చూసేసరికి మామిడి, కీర కనిపించాయి. వెంటనే కామాక్షి, శ్రీ రామ నవమి వస్తోంది కదా, వడపప్పు ప్రసాదం లో మామిడి ముక్కలు, కీర ముక్కలు, సన్నగా తరిగి, దానికి కొబ్బరి తురుము, కాస్తంత ఉప్పు, కారం కలిపితే ఇటు ప్రసాదం లాను, అటు సాలడ్  లాను పనికి వస్తుందని, మామిడి, కీర  చెరొకటి తీసుకుని సంచీలో వేసుకుంది. సంచీలో పడ్డ మహారాణి, రాకుమారి.. అదేనండి మామిడి, కీర, ఇద్దరు  మోహ మొహాలు చూసుకుని కిసుక్కుని నవ్వుకున్నాయి.

*****

2 comments:

  1. The dialogue between Mamidi and Kheera is very imaginative and hilarious. Very original and born out of the fertile imagination of the writer Ratna in her inimitable style.

    ReplyDelete
  2. ఈ సంచికకు రత్న గారి కీర మామిడి తగవు శీర్షిక highlight. చాల అద్భుతమైన సంభాషణలతో ఆ రెండిటి వాడకం మరియు ఉపయోగాలతో చాల చక్కగా interesting గా రాయటం చాల బాగుంది . కామాక్షి character and ఆలోచనలు ప్రతి గృహిణి కి చాల దగ్గరగా వున్నాయి . ఇంకా ఇలాంటి రచనలు ముందు ముందు సంచికలలో వస్తాయని ఆశిస్తూ....

    ReplyDelete