Tuesday, December 30, 2014

బెంగుళూరు వంకాయ - టమాటో పచ్చడి


శ్రీమతి రత్నా శ్రీనివాస్

దీనిని చౌ చౌ అని,స్క్వాష్ అని కూడా అంటారు. ఇది రుచిలో ఆనపకాయను పోలి వుంటుంది.

కావలసిన వస్తువులు: 
బెంగుళూరు వంకాయ                                           1
టమాటాలు                                                          5
ఉప్పు                                                                 రుచికి సరిపడ
పసుపు                                                               చిటికెడు 
ఎండుమిర్చి                                                        4
పచ్చి మిర్చి                                                         2
మినప పప్పు                                                       2 టేబుల్ స్పూన్స్ 
ఆవాలు                                                               1/4 టీస్పూన్ 
ఇంగువ                                                              10 గ్రాములు 
నూనె                                                                 2 టేబుల్ స్పూన్స్ 
కొతిమీర                                                             కొంచెం 

తయారు చేయు విధానం: 
మొదట బెంగుళూరు వంకాయను బాగా కడిగి చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగ తరుక్కోవాలి. ఒక బాండీ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇపుడు తరిగిన బెంగుళూర్ వంకాయ ముక్కలు వేసుకొవాలి. తగినంత ఉప్పు,చిటికెడు పసుపు వేసి కలియబెట్టుకొని మూత పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. ముక్కలు వేగేలోగా టమాటాలు తరుక్కుని పెట్టుకోవాలి . 

స్టవ్ మీద ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి. ముక్క మెత్తగా కానక్కర్లేదు. వేగితే చాలు. కొంచెం వేగిందని అనిపించాక తరిగిన టమాటా ముక్కలు వేయాలి. దానితో పాటు 2 పచ్చి మిర్చి కూడా మధ్యకి తుంపి వేయాలి. మొదట బెంగుళూరు వంకాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేము. టమాటాలు కూడా దానికి జత చేసేము కాబట్టి టమాటాలకి సరిపడా మరల కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇపుడు మూత బెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి. కొంచెం సేపటికి టమాటాలు మెత్తగా వుడికిపోతాయి. మంట పెద్దది చేసి టొమాటల తడి ఇగిరి పోయేటట్లు చేసుకోవాలి. ఇపుడు బాండి ని స్టవ్ మీద నుండి దింపి ముక్కలు చల్లారే వరకు ఆగాలి. 

స్టవ్ మీద వేరొక చిన్న బాండి పోపుకి పెట్టుకోవాలి. ఒకటేబుల్ స్పూన్ నూన్ వేసి కాగేక మినప పప్పు వేసి రంగు మారెంతవరకు వేయించుకోవాలి. ఆవాలు,ఎండుమిర్చి వేసుకుని చిటపట లాడేక ఇంగువ, కరివేపాకు రెబ్బలు వెసుకొవాలి.  

పోపు చల్లరేక మిక్సీ లో తిప్పుకోవాలి. ఈ పాటికి ముక్కలు కూడా చల్లరిపోతాయి కాబట్టి అవి కూడా వేసి,కొతిమీర కూడా జత చేసి  కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్ కాని చిన్న గిన్నెలోకి కాని తీసుకోండి. 

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనే కాకుండా ఇడ్లి,దోశ,ఉప్మాలో కూడా చాల బాగుంటుంది. పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2,3 రోజులు నిల్వ కూడా వుంటుంది. టమాటాల బదులు చింత పండు కూడా మీరు వేసుకోవచ్చును. ఐతే టమాటాల వలన ఎర్రటి రంగు వచ్చి అందంగా కనిపిస్తుంది





Sunday, December 28, 2014

వాణి వంటింటి విచిత్రాలు: మామిడికాయ పప్పుకి దీటైన పప్పు!


ముందుమాట:

వాట్స్ అప్ ద్వార తెలిసిన బ్రేకింగ్ న్యూస్!  వంట విచిత్రాల వాణి, కబుర్ల కామాక్షి మధ్యాహ్నం కాలక్షేపానికి కలుస్తున్నారుట! మరి ఏమి వింతలూ విచిత్రాలు జరుగుతాయో! అన్నట్లు లోపాయకారి గా తెలిసినదేమిటంటే, జ్వర పడి లేచిన వాణి అత్తగారికి మామిడికాయ పప్పు తినాలని ఉందిట. కాని మామిడికాయలు లేవే! కానీ ఇవన్నీ వాణి కి ఒక లెక్కా? ఎదో విచిత్రం చేసింది! అదేమిటో చూద్దాం!

రమణ బంధకవి


సంపాదకుడు



మామిడికాయ పప్పుకి దీటైన పప్పు!



శ్రీమతి నయన కస్తూరి



“మధ్యాహ్నం భోజనాలు  తొందరగా కానిచ్చుకుని వస్తా!  కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు. మీరు కూడా కాస్త తొందరగా తెమల్చుకోండి. ఈ మధ్య కలిసి చాలా రోజులైంది”  అని 'వాట్స్ అప్’ లో కామాక్షి పంపిన మెసేజ్ చదువుకుంది వాణి . ఈ పూట కి కూరలేమున్నాయో అనుకుంటూ ఫ్రిజ్ తెరిచింది వాణి . కాస్త తోటకూర పప్పు, వంకాయ కారం పెట్టి కూర, టమాటో వేసి చారు పెడితే సరి అనుకుంది . అటుగా వచ్చిన అత్తగారు “ఈ రోజు భోజనం లోకి ఏదైనా పుల్లటి పప్పు చేయరాదుటే వాణీ ! మొన్న జ్వరం వచ్చి తగ్గినప్పటి నుండి నోరంతా చప్పబడి మామిడి కాయ పప్పు తినాలనిపిస్తోందే అమ్మా” అంది.  “చచ్చాం! ఇప్పుడు మామిడికాయ నేనేక్కడనుండి తెచ్చేది? ఎం చేయాలబ్బా అత్తయ్య నోటికి కాస్త హితవుగా !" అనుకుంటూ ఫ్రిజ్ అంతా  కలియజూసింది. వాణి కళ్ళు ఒక చోట ఆగాయి. పెద్ద పెద్దవే అయిదు కాయలు ఉన్నాయి.  'ఐడియా! వీటి తో పప్పు చేసి, కాస్త కారం కారం గా పోపు దట్టిస్తే మామిడికాయ పప్పు స్తాయినే పెట్టచ్చు గారంటీగా !' అనుకుంటూ చిన్న కుక్కర్లో ఒక గ్లాస్ కంది  పప్పు సరిపడ నీళ్ళతో, ఆ అయిదు కాయలను చిన్నగా తరుగుకుని, స్టవ్ మీద పడేసింది. పప్పు చేసి పోపు పెట్టి, చివరలో కిందకు దింపాక  ఉప్పువేసి, బాగా కలిపి బంగారు వర్ణం లో పప్పు చేయడం, “అబ్బ నోటికి జిహ్వ లేచి వచ్చిందే !ఎంత బాగా చేసావు అడగం గానే, నీ కడుపు చల్లగానూ!” అంటూ ఒకటికి రెండు సార్లు వేసుకుని తింటున్నంతసేపు కోడలిని, పప్పుని మెచ్చుకుంటూనే వుంది. అత్తగారి తో పాటు ఇంటిల్లపాదికి ఎంతగానో నచ్చింది. 

మధ్యాహ్నం  వాణి ఇంటికి వచ్చిన కామాక్షి ఈ సంగతి తెలుసుకోవడం, మరునాడు తనుకూడా ఆ గమ్మత్తు  పప్పు చేయడం సూరీడమ్మ , విశ్వనాధం, పట్ట్టాభి తో పాటు మామగారు లోట్ట లేసుకుని తినడం జరిగిపోయాయి. 

మరి మీకు కూడా ఆ పప్పు ఏమిటో, ఎలా చేయాలో తెలుసుకుని  మీరు కూడా  వెంటనే ట్రై చేసి, మీ కుటుంబ సభ్యుల దగ్గర మార్క్స్ కొట్టేద్దామని  ఉందా? అయితే అది ఏ పప్పో, దాని రెసిపీ ఏమిటో ఇప్పుదే ఇక్కడే చెప్పేస్తున్నా.  మరి మీరు కూడా చేసుకుని, అది ఎంత బాగా వచ్చిందో మాకు తెలియజేయండి!

ముందుగా వాణి వాడిన కాయలు ఏమిటో తెలుసుకొండి. ముందు రోజే బజార్ లో కొన్న తాజా పెద్ద ఉసిరికాయలు. సో అది పుల్లటి ఉసిరికాయ పప్పు అన్న మాట!

కావలిసిన వస్తువులు :
కంది  పప్పు ఒక గ్లాస్ 
పెద్ద ఉసిరికాయలు -

పోపు దినుసులు:
పది మెంతి గింజలు,
ఒక చెంచాడు మినప్పప్పు,
చెరొక పావు చెంచాడు ఆవాలు,జీలకర్ర,
నాలుగు మిరపకాయలు  చిన్న ముక్కలుగా. 
పచ్చిమిరపకాయలు -4
వెల్లుల్లి రేకలు- 6 లేదా ఇంగువ ఒక చిటికెడు [మీకేది ఇష్టమో అది]
కరివేపాకు రెమ్మలు: రెండు
కారం-ఒక పావు చెంచా 
పసుపు చిటికెడు 
ఉప్పు – తగినంత
నూనె – రెండు చెంచాలు 

చేసే విధానం:
ముందుగా కందిపప్పుని తీసుకుని కడిగి మెత్తగా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసిపసుపు కారం కూడా వేసి, ఉంచుకోండి.  ఈ లోగా ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి . ఉసిరికాయ గట్టి కాయ కావడం వలన ముక్కలుగా తరుక్కోవడం చాలా కష్టం  బాబోయ్ ! ఉసిరికాయపప్పు కేన్సిల్!' అనేసుకుంటున్నారా? పట్టుకుని చాకు దెబ్బ వేద్దా మనేలోపు ఉసిరికాయ చెంగున ఒక్క గెంతు తో తప్పించుకుని, చాకుకి మన వేలిని బలి చేసి అది దొర్లుకుంటూ పోతుందని నాకూ తెలుసు. అందుకే అలా కాకుండా “ నన్ను మీ ఇష్టం వచ్చిన సైజ్ లో కట్ చేసుకోండి”  అని వినయం గా మీ చాకుకి  తల వంచుకుని నిలబడే ఒక చిట్కా చెప్తా ఇప్పుడు. ఏమీ లేదండీ! ఉసిరికాయలను కడిగి చిటికెడు పసుపు వేసి మైక్రో వేవ్ బౌల్ లో వేసి ఒక మూడు నిమిషాల సేపు మైక్రో వేవ్ లో మగ్గబెట్టండి. అంతే! కాయలు మెత్తగా  అయి చూపుడు వేలుతో నొక్కగానే ఏ ముక్కకి ఆ ముక్క విచ్చుకుని గింజ విడిగా వచ్చేస్తుంది. గింజలు విడిగా తీసుకుని, ఆ మెత్తటి ముక్కల్నిసులభం గా  మరింత చిన్న గా తరుగుక్కోవచ్చు.    ఇప్పుడు ఆ ముక్కలను, తీసుకున్న పచ్చి మిరపకాయలను  చీలికలు గా చేసి వాటినీ  కుక్కర్లో ఉంచిన పప్పు పైన వేసి కలపకుండా, మూత  పెట్టి అయిదార్ విజిల్స్ వచ్చేక చిన్న సెగ మీద అయిదు నిమిషాలు ఉంచితే మెత్తగా ఉడుకుతుంది. ముక్కల్ని పైకి కిందకి కలిపారంటే పులుపు తగిలి పప్పు మెత్తగా ఉడకదు. గుర్తు పెట్టుకోండి. 

ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు, మినపపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి, వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రేకలు కాని, ఇంగువ కాని వేసి, వేగాక, ఈ పోపుని వుడికిన పప్పుకి దట్టించి, పోపు పప్పుకి పట్టేలాగా మూడు నిమిషాల సేపు స్టవ్ మీద పెట్టుకోవాలి . దింపిన తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు చివరలో ఎందుకు వేసానో తెలుసా మీకు? ఉప్పు ముందుగా ఉసిరికి కలిపితే నల్లబడుతుంది. దింపాక వేస్తె పప్పుకొచ్చిన బంగారం రంగు అలాగే ఉంటుంది. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టడం,  పోపు మామిడి కాయ పప్పు లాగానే ఉండటం  వలన ఉసిరి కాయ పప్పు మామిడి కాయ పప్పు కి ఏ మాత్రం రుచి లో తీసిపోదు సుమండీ! అంతే  కాదండీ ఉసిరికాయ తినడం వలన రక్త శుద్ధి, రోగ నిరోధక శక్తి వృద్ధి, జ్ఞాపక శక్తి మెరుగుదల లాంటి ఎన్నో లాభాలు ఉంటాయని మీకు వేరే చెప్పక్కర్లేదు!

ఉసిరికాయల తో పచ్చళ్ళే కాకుండా పప్పు కూడా అమోఘం గా చేసుకోవచ్చని తెలుసుకున్నారుగా? మరింకెందుకు ఆలస్యం? ఈ సారి ఉసిరికాయలు తెచ్చుకున్నప్పుడు పప్పులో పడేసుకుని, పోపు బాగా దట్టించు కుని, వేడి వేడి అన్నం లో కమ్మటి నేతిని జోడించి,తోడుగా ఊరు మిరపకాయలు ఏర్పాటు చేసుకుంటే ఆ రోజు మాత్రం మీ భోజనం అద్భుతః ! కాదనగలరా?