Monday, February 23, 2015

‘ఉపాహారాలకు చక్కని అనుపానం – పసందైన ఉల్లికారం’

ముందుమాట:
లోగడ మనం గుంత పొంగరాలు వగైరా ఉపాహారాలను గురించి చెప్పుకున్నప్పుడు, వాటిలోకి పసందైన అనుపానం గా ఉల్లికారం గురించి ప్రస్తావించటం జరిగింది. అప్పుడు పాఠకులు కొందరు ఉల్లికారం తయారీ గురించి చెప్పవలసిందిగా కోరారు. కనుక మీ అందరికోసం ఉల్లికారం తయారీ విధానం చేపుతున్నరు శ్రీమతి రత్న.

రమణ బంధకవి

సంపాదకుడు

‘ఉపాహారాలకు చక్కని అనుపానం – పసందైన ఉల్లికారం’

శ్రీమతి రత్నా శ్రీనివాస్


కావలసిన పదార్దములు :
ఉల్లిపాయలు                         2-3
ఉప్పు                                  తగినంత 
పసుపు                               చిటికెడు 
చింతపండు                          నిమ్మ పండు పరిమాణం 
బెల్లం                                   చిన్న ముక్క 
నూనె                                 1 టేబుల్ స్పూన్ 

పోపుకు కావలసిన పదార్దములు:
ఎండు మిర్చి                         6-7
మినప పప్పు                       1 టేబుల్ స్పూన్ 
ఆవాలు                               1 టీస్పూన్ 
ఇంగువ                                సువాసన కు 
కారం పొడి                            1/2 టీస్పూన్ 
నూనె                                   2 టేబుల్ స్పూన్స్ 

తయారు చేయు విధానం :
ఉల్లిపాయలను కడిగి చెక్కు తీసుకుని కొంచెం పెద్ద ముక్కలు తరుక్కున్నా పర్వాలేదు. బాండీ  తీసుకుని నూనె వేసి వేడేక్కేక ఉల్లిపాయ ముక్కలను వేసి పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు  వేయించుకోవాలి. ముక్కలకి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలియబెట్టి వేయించుకోవాలి. 

ఒక కప్పులో చింత పండుని నాన బెట్టుకోవాలి. నానిన చింత పండుని పిసికి గుజ్జు ఉల్లిపాయ ముక్కలు వున్న బాండీ లో వేసిమరొక సారి కలియబెట్టి వేయించుకుని స్టవ్ ఆపెసుకోవాలి.ఇప్పుడు బెల్లం ముక్కను ఉల్లిపాయ, చింత పండు వున్న మిశ్రమం లో వేసుకోవాలి. 

వేరొక చిన్న బాణలి లో నూనె వేసి వేడేక్కేక ఎండు మిర్చి, ఆవాలు వేసి వేగేక ఇంగువ వేసి స్టవ్ ఆపెసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో కారం పొడి వేయాలి. 

ఉల్లిపాయ ముక్కలు చల్లరేక, గ్రైన్దర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకుని వేయించిన పోపుని కలుపు కోవాలి. పుల్లపుల్లగా, తీయతీయని, ఉల్లికారం తయారయ్యింది. 

ఇది ఇడ్లీ, దోస, చపాతీ, పరాట, గుంత పొంగరాలు మొదలగు టిఫిన్ల కే కాకుండా అన్నం లోకి కూడా అద్భుతంగా వుంటుంది. 




Wednesday, February 18, 2015

....రావయ్యా శివయ్య ..

మహాశివరాత్రి పర్వదినాన్న ఆ సదాశివుని భక్తితో, ఆర్తితో ప్రార్ధిస్తూ మనసు పలికిన నాలుగు మాటలను మీ ముందు ఉంచుతున్నాను.

రమణ బంధకవి



....రావయ్యా శివయ్య ..

రమణ బంధకవి


ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

పట్టు బట్ట నేత గానికి ... అయ్యో పాపం ..కట్టు బట్ట కరువాయే..
బరువు మగ్గాల బతుకు సీకటిలో..ఉసురులెన్నో వెలసిపోయే..
పులి తోలు గట్టె వానికి..అబ్బా గుండె యెంత కరుకాయనే ..
చంద్రవంకకు జెప్పి ఇసుమంత ..వెండి వెన్నెల గురిపించవె?

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

హలం బట్టి పొద్దంతా...పొలం దున్నగా  రైతన్న ..
ముప్పొద్దు బొంచేయ్యగా ...పట్టేడంత  మెతుకు గూడ కరువాయేనే!
కలకంటి కన్నీటి గంగ పొంగి .. పెను వరదై ఆశలన్ని ముంచేసినే
తల పైని  గంగమ్మకు జెప్పరాదా? కరుణించి  భూదేవిని తడపేనే !

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

పండు ఫలాల ధరల జూసి  బాబోయి గుండె ఎంతో బరువాయె
కాయగూరలు, పాలు పెరుగులు, మందుమాకులు...అవి ఇవి గావే
ధరల బలురక్కసి గోరల జిక్కి ... బడుగు జీవి  నలిగి పోయే 
'బసవన్నను' ఉరికించి, డమరుకం మోగించి గాయంగా రావే!

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

శివ రాత్రి పర్వ దినాన మనసు పెట్టి కోరుదునయ్య
నీ ధ్యానం వీడి, నీ మౌనం వదలి యిక మా వంక జూడవయ్య
ప్రమద గణాలను బంపి...బలు  చీకట్లను దోలవయ్య
అనంద తాండవ మాడి... ఇల  బ్రతుకులను బ్రోవవయ్యా

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..





Monday, February 16, 2015

శివరాత్రి ప్రత్యేక వ్యాసం: ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ!


ముందుమాట:  
పాఠకులందరకు మహాశివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలు ! లోగడ మనం కార్తీక మాస సందర్భం గా ప్రత్యేక వ్యాస పరంపర ద్వారా ఆ మహాశివుని స్మరించుకున్నాము. రేపు అనగా ఫెబ్రవరి 17 వ తారీఖున మనం మహాశివుని అరాదించుకుందాము.

రమణ బంధకవి

సంపాదకుడు


శివరాత్రి  విశిష్టత

శ్రీమతి నయన కస్తూరి


                                త్రిదళం, త్రిగుణాత్మకం, త్రినేత్రంచ, త్రియాయుధం!
                                  త్రిజన్మపాపసంహారం, ఏక బిల్వం శివార్పితం! 

హిందూ పండుగలలో  శివరాత్రి ఒక ముఖ్యమైన పండుగ. "ముఖ్యమైన" అని ఎందుకన్నానంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదంటారు. అందుకని మన జీవితాలు ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవాలంటే ఆయన అనుజ్ఞ తప్పక  అవసరం. ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి శివరాత్రి పర్వదినం మంచి అవకాశాన్ని మనకి ప్రసాదిస్తుంది.

ముందుగా శివరాత్రిని ఏ సందర్భంలో జరుపుకుంటామో చూద్దాం. ఈ పవిత్రమైన  రోజునే పరమేశ్వరుని జననము, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఈ పండుగ  ప్రతి సంవత్సరం మాఘ మాసంలో  బహుళ పక్షం లో మాసశివరాత్రి నాడు జరుపుకుంటాము.

శివరాత్రి నాడు భక్తులు వేకువజామునే లేచి, తల మీద స్నానం చేస్తారు. నదీ స్నానమైతే మరీ పుణ్యం. ఎవరైతే  శివరాత్రి నాడు ఈ విధంగా "శివ ....శివ" అంటూ తలారా స్నానం చేస్తారో, వారు పవిత్ర గంగా నదీ స్నాన పుణ్యం పొంది తీరుతారు. నాడు   శివాలయాలకు వెళ్లి, శివుని దర్శనము, అభిషేకాలు, అర్చనలు  జరిపించుకుంటారు.  మహేశ్వరుని అర్చనలో బిల్వపత్రానికి ఒక విశిష్ట స్తానం వుందిఈ   బిల్వపత్ర పూజ అంటే ఆ చంద్రశేఖరునికి అత్యంత ప్రియం. ఉపవాసాలుంటారు,  రాత్రి పండ్రెండు గంటలకు లింగోద్భవ కాలం లో శివుడికి అభిషేకాలు చేసి పార్వతీపరమేశ్వరుల కల్యాణం భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. విశ్వనాధుని ద్యానించుకుంటూ జాగరణచేస్తారు. ఈ పండుగను పెద్ద చిన్న బీద, గొప్ప తారతమ్యంలేకుండా అందరూ భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో   జరుపుకుంటారు. 

శివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో శంకరుని ఆరాధిస్తే ఎంతటి పాపమైనా హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ పార్వతీపతి. ఈ విషయాన్ని మన పురాణాలలోని ఎన్నో కథలు గుణవంతుడు, భక్తకన్నప్ప మొదలగు వారి కథలు కూడా బలపరుస్తున్నాయి.

ఇక లింగోద్భవ కాలం  విశిష్టత వివరించవలసి వుంటుంది. పూర్వం  బ్రహ్మ, విష్ణువుల మధ్య  'ఎవరు గొప్ప?'  అనే వివాదంలో శివుడు మధ్యవర్తిత్వం  వహించి,          "ఎవరు  నా తుది కాని, మొదలు కాని కనిపెడతారో  వారే గొప్ప" అని చెప్పి లింగరూపంలో పెరిగిపోతూ ఉంటాడు. బ్రహ్మ మొదలు చూడటానికి పాతాళలోకానికి, విష్ణువు ఊర్ధ్వ లోకాలకు పయనించారు . కానీ  వారు  తమ  ప్రయత్నంలో  విఫలమైనారు. బ్రహ్మ మొగలిపూవు, ఆవుల అబద్ధపు సాక్ష్యాలతో కనిపెట్టానని  అసత్యం పలికాడు. ఆవు అవునని మొహంతో అసత్యం, తోకతో కాదని నిజం చెప్పడంతో ఆవు తోక పూజ్యనీయమైంది. మొగలిపూవు, ఆవు ముఖము పూజకు అనర్హమని పరమేశ్వరుడు ఆగ్రహంతో శపించినాడు. శివుడినిఆ సమయంలో  శాంతింప చేయడానికీ అభిషేకం చేయడంతో ఆ ఆచారమే ఇప్పటికీ కొనసాగుతోంది.  బ్రహ్మ, విష్ణువులు కూడా శివుడు లింగ రూపంలోనే పూజలందు కోవాలని అన్నారు.

బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం!
జన్మజ ధు:ఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం!!

మన దేశమంతటా కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఎన్నో శివక్షేత్రాలు కలవు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కలవు. ఆంధ్ర ప్రదేశ్ లో శివుని పంచారామాలు వున్నాయి. అన్నిచోట్లా శివరాత్రి సందర్భంగా ఎన్నో భక్తి  కార్యక్రమాలు జరుగుతాయి. స్త్రీలు ఏమైనా నోములు చేయదలుచుకుంటే ఈ రోజే సంకల్పం  చెప్పుకుంటారు. శివునికి ఆదిభిక్షువు, సాంబశివుడు, జటాధరుడు, నీలకంటుడు...ఇలా అనేక పేర్లతో పిలవబడతాడు. బోళాశంకరుడని కూడా పిలుస్తారని  మనకందరికీ  తెలుసు. చాలా తొందరగా, సులభంగా భక్తులకు ప్రసన్నమై అందరి కోరికలు తీరుస్తాడు. అనారోగ్యంతో బాధపడేవాళ్లకి శివ నామ స్మరణం దివ్యౌషధం.  మనమందరం కూడా రేపు అనగా 17 వ తారీఖున శివరాత్రి పుణ్యదిన సందర్భంగా పార్వతీ పరమేశ్వరులని పూజించి, వారి అనుగ్రహం పొందుదాం. శివ పంచాక్షరీ మంత్రం "ఓం నమశ్శివాయ" జపిస్తే  పంచ  మహాపాతకాలు  పటాపంచలు అవుతాయి.