శ్రీమతి రత్నాశ్రీనివాస్
(జరిగిన కధ: రాత్రి భోజనంలోకి అమ్మలు
కట్టిచ్చిన ఫలహారం తిని, మరచెంబులో పోసి ఇచ్చిన నిమ్మకాయ మజ్జిగను తలా కొంచెం
తాగేరు.
మరునాడు ఉదయమే రామేశ్వరం చేరుకున్నారు.
వున్న వాటిల్లో ఒక మంచి హోటల్ లో బస చేసేరు. స్నానాలు చేసి కాఫీ
తాగి దేవుడి దర్శనానికి బయలుదేరేరు.)
గుడి గోపురాన్ని దూరం నుంచే చూసి
సూరిడమ్మ గారు ఉద్వేగంతో “రామలింగేశ్వర స్వామీ ఇన్నేళ్ళకి నీ దర్శన భాగ్యం
కలిగింది నాయనా!” అంటూ చేతులెత్తి నమస్కరించారు. గుడికి చేరుకున్నారు. లక్ష్మీకాంతం
గారు కండువా భుజాన వేసుకుని సముద్రస్నానానికి బయలుదేరేరు. వెనుకే విశ్వం, పట్టు
కూడా బట్టలు తీసుకుని బయలుదేరేరు. సూరిడమ్మ గారు రాలేనని చెంబుతో నీళ్ళు తెస్తే
నెత్తిన కాసిని చిలకరించుకుంటానని
అన్నారు.
సముద్ర స్నానానికి వెళ్ళే దారిలో “కరివెన సత్రం”
కనిపించింది. లక్ష్మీ కాంతం గారు “వుండండి రా! భోజనాలకి పేరు రాయించుకుని వస్తాను” అని గబగబా సత్రం
వైపు అడుగులు వేసేరు. ఇక్కడ మీకు “కరివెన సత్రం” గురించి కొంత చెప్పాల్సి వుంది. కరివెన వారి సత్రాలు చాల
పుణ్యక్షేత్రాలలోఉన్నాయి. శ్రీశైలం, భద్రాచలం, కాశీ, రామేశ్వరం మొదలైనవి. వీరు
యాత్రికులకు వసతి కలిపించటమే కాకుండా వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు కూడా చేస్తారు.
వంట చేసేవారు కూడా శుచిగా, శుభ్రంగా వుంటారు. పంచభక్ష్యపరమాన్నాలు కాకపోయినా
మామూలు భోజనమే చాల రుచిగా పెడతారు. ఇంటి
భోజనానికి ఒక పాలు ఎక్కువే వుంటుంది కాని తక్కువ మాత్రం కాదు. ముఖ్యంగా అత్తమామలకు,
విశ్వానికి అక్కడ నచ్చే విషయం ఏమిటంటే
అచ్చమైన తెలుగు సాంప్రదాయపు వంటలు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కరివెన సత్రం
భోజనం తినందే వాళ్ళు ఇంటి ముఖం పట్టరు. మధ్యాహ్నం భోజనానికి వస్తామని మామగారు
పేర్లు నమోదు చేసేరు. రెండు గంటలకు ఆఖరి పంక్తి అని చెప్పేడు సత్రపు యజమాని.
సముద్రస్నానం పూర్తి అయ్యింది. మామగారు మరచెంబుతో
నీళ్ళు తెచ్చేరు. కామాక్షి, అత్తగారు నెత్తి మీద నీళ్ళు జల్లుకున్నారు. 24
బావుల్లో స్నానం చేయటానికి కామాక్షి, మామగారు, పట్టు వెళ్ళేరు. విశ్వం తల్లికి
తోడుగా కూర్చున్నాడు. ఒంటి గంటకు గుడి మూసేస్తారని తెలియటంతో గబా గబా బావుల్లో
స్నానం చేసి ఒక బిందెతో అత్తగారికి, విశ్వానికి నీళ్ళు పట్టుకొచ్చారు. తల
తడుపుకుని దర్శనానికి బయలుదేరేరు. అత్తగారు కాశీ చెంబులోని నీరు అభిషేకానికి
ఇచ్చేరు. దర్శనం దివ్యంగా అయ్యింది. రామలింగేశ్వరుడు కళకళ లాడుతున్నాడు. అమ్మవారి
దర్శనం కూడా అయ్యేక కరివెన సత్రానికి భోజనానికి బయలుదేరేరు. వీళ్ళదే ఆఖరి పంక్తి. శుబ్రంగా
కడిగి, తుడిచిన ఆకులు వేసి వడ్డన మొదలెట్టేరు. టమాటో పప్పు, బంగాళా దుంప- వంకాయ అల్లం, పచ్చి మిర్చి కూర, ఒక పచ్చడి వేసి వేడి
వేడి అన్నం వడ్డించేరు. ఆకలి మీద వున్నాడేమో విశ్వం వేడి అన్నం ఊదుకుంటూ పప్పు
కలుపుకోబోయేడు. కరివెన సత్రంలో సాధారణంగా వడ్డన అయ్యేక బ్రాహ్మణుడు మంత్రం
చెప్పేక, ఔపోసన చేసి అప్పుడు తినటం మొదలెట్టాలి. మంత్రం చెప్పకుండానే విశ్వం భోజనానికి ఉపక్రమించటం చూసి వారించేడు. విశ్వం
మంత్రం అయ్యేంతవరకు అసహనంగా ఆగేడు. మంత్రం పూర్తయ్యింది. మామగారు ఔపోసన పట్టేరు. అందరు
కలుపుకోవటం మొదలు పెట్టేరు. (సశేషం)
No comments:
Post a Comment