Tuesday, February 3, 2015

రామేశ్వరం యాత్ర – బియ్యపు పిండి రొట్టె – ఆవకాయ బద్ద! రెండవ భాగం


 శ్రీమతి రత్నాశ్రీనివాస్

 మరుసటి దినమే రామేశ్వరం వెళ్ళే రోజు. “మనం పెట్టిన గుమ్మడి వడియాలు కాసిని అమ్మలుకి తీసుకుపోదామే” అన్నారు అత్తగారు.
“పచ్చళ్ళు కూడా తీసుకు వెళదాం అత్తయ్య! ఎలాగు కార్లోనే వెళుతున్నాముగా” అని తనకి తెచ్చిన పచ్చళ్లలోనే అన్నీ కొంత కొంత తీసి సర్దింది.
విశ్వనాథం, పెందరాడే బయలు దేరితే దారిలో టిఫిన్లు తిని, భోజనం వేళకు అమ్మలు ఇంటికి జేరుకోవచ్చని, టిఫిన్ల పని ఇంట్లో  పెట్టుకోవద్దని చెప్పేడు.
“ఆ...! వాడు బైట తింటే తిన్నాడు, పెద్ద వాళ్లము. పిల్లవాడు కూడా వున్నాడాయే! వాడు అలాగే అంటాడుగాని  మనం బియ్యప్పిండి రొట్టి, ఆవకాయ ముక్క చేతిలో వుంచుకుంటే మంచిది” అన్నారు అత్తగారు.
“బియ్యప్పిండి రొట్టె! అంత ప్రొద్దున్నే తయారవుతుందా? మా చిన్నప్పుడు మా అమ్మ కుంపట్లో చేసేది. గంటలు గంటలు పట్టేది” అంది కామాక్షి.
“ఇవేమైనా కుంపటి రోజులటే! స్టవ్ మీద సన్న సెగన బాండీ పెట్టి మరింత నూనె పోసి బియ్యప్పిండి వేసామంటే గంటలో చెక్కు కట్టదూ!” అయినా ప్రొద్దున్నే ప్రయాణం పెట్టుకుని మనమేమైన రొట్టె వేసుకుంటూ కూర్చుంటాముటే! రాత్రి భోజనాలయ్యేక వేసుకుని స్టీలు డబ్బాలో పెట్టుకుందాం!”
“మరి రేపటికి బావుంటుందా! సందేహంగా అడిగింది.
“నిక్షేపంగా వుంటుంది! నన్నడిగితే దిబ్బ రొట్టి, బియ్యప్పిండి రొట్టెలు ఆ రోజు కన్నా మరుసటి రోజుకే మరీ బావుంటాయి. ఆ రోజుల్లో రైలు ప్రయాణాలంటే దిబ్బ రొట్టేలో, బియ్యప్పిండి రొట్టేల్లోనో ఇంత ఆవకాయో, అల్లప్పచ్చడో వేసుకుని తీసుకుపోయే వాళ్ళం. కాశి వెళ్ళినపుడు కూడా దిబ్బ రొట్టే రెండు రోజుల వరకు మా ఫలహారం. అయినా సన్నని సెగని ఉడుకుతుంది. ఇంత నూనె కూడా పోస్తామాయే! పాడైపోతుందనే సందేహమే అక్కర్లేదు నీకు” నొక్కి వక్కాణించారు.

రాత్రి భోజనాలు అయ్యి అన్ని సర్దుకున్నాక పిండి రొట్టె చేయటానికి వంటిట్లోకి జేరేరు కామాక్షి, అత్తగారు. కామాక్షిని రెండు గ్లాసుల బియ్యప్పిండిని కొలిచి పళ్ళెంలో పోయమన్నారు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు గ్లాసు సెనగపప్పు తీసుకుని పక్కన పెట్టుకోమన్నారు. ఈలోగా ఆవిడ ఒక దళసరి గిన్నెలో పిండి కొలిచిన గ్లాసుతోనే 2 గ్లాసుల నీళ్ళు, పైన ఇంకొక పావు గ్లాసు కొసరిగా నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి వెలింగించారు. తగినంత ఉప్పును, జీలకర్ర, సెనగ పప్పు నీళ్ళల్లో వేసి కలిపేరు. ఐదు నిమిషాలలో నీళ్ళు మరిగిపోయాయి. స్టవ్ ని తగ్గించి కామాక్షిని మరిగిన నీళ్ళల్లో బియ్యప్పిండిని వేస్తూ సమానంగా కలపమన్నారు. కామాక్షి పిండి దగ్గర పడేదాకా కలిపి అడుగంటకుండా స్టవ్ ఆపేసింది. గిన్నెలోని పిండిని గరిటెతో తీసి పళ్ళెంలో పరచినట్లుగా చేసి ఆరబెట్టమన్నారు. బియ్యప్పిండి వుడుకుతున్నపుడు, సెనగ పప్పు, జీలకర్ర కమ్మని వాసనకి టీవీ చూస్తున్న విశ్వనాథం, పట్టాభి వంటిట్లోకి వచ్చి ఏమి చేస్తున్నారని అడిగేరు.
కామాక్షి మాట్లాడలేదు. అత్తగారు “పిండి రొట్టేరా! దారిలో తినటానికి” అన్నారు.
“బైటే తిందామని చెప్పేను కదమ్మా! నీకు మరీ చాదస్తం. రేపు ఉదయమే ప్రయాణం పెట్టుకుని ఇంతింత పనులేమిటి?” విసుక్కున్నాడు విశ్వనాథం.
“నీ మొహం! నువ్విప్పుడు ఈ మాట అంటున్నావు కాని రేపు, మొట్టమొదట డబ్బా మూత తీసేది నువ్వే! నీ సంగతి నాకు తెలియదుట్రా!” అన్నారు.
“సరే! మీ ఇష్టం!” అని పట్టాభిని పడుకోవాలని ప్రొద్దున్నే లేవాలని చెప్పేడు.
“డాడీ! నాకా రొట్టె వద్దు. నేను దారిలో mcdonalds లోనే తింటా” ఖచ్చితంగా చెప్పేడు.
పళ్ళెం లోని బియ్యప్పిండి చల్లారింది. కామాక్షిని చేతికి నూనె రాసుకోమని పళ్ళెం లోని పిండిని చపాతి పిండిలాగా పెద్ద వుండ చేయమన్నారు. చేతికి నూనె రాసుకోవటం వల్ల పళ్ళేనికి పిండి అతుక్కోకుండా నున్నగా వచ్చేసింది. ఇపుడు వేరొక పళ్ళెం లో కొద్దిగా నూనె రాసి బియ్యప్పిండి ఉండను వెడల్పుగా చేత్తో నొక్కమని, ఆవిడ పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోశారు. నూనె కాగేక రొట్టెలాగా వత్తిన పిండిని  జాగ్రతగా నూనె లో వేయించారు. మంటను చిన్నదిగానే వుంచి మూత పెట్టి కామాక్షిని చూసుకోమని తను మందులు వేసుకుని వస్తానన్నారు.

“నాకు పద్దతి తెలుసు అత్తయ్య! చిన్నప్పుడు మా అమ్మ చేసినపుడు చూసేదాన్ని. కాకపొతే నూనె ఎక్కువ పడుతుందని, గ్యాస్ సిలిండర్ కూడా తొందరగా ఖాళీ ఐపోతుందని చేయను అంతే! మీరు వెళ్లి పడుకోండి. ప్రొద్దున్నే ప్రయాణం కదా! వుడికేక ముక్కలుగా కోసి డబ్బాలో పెడతాను” చెప్పింది కామాక్షి.
“తొందరపడి వుడకకుండా తియ్యకు సుమా!” అని చెప్పి వెళ్లి పడుకున్నారు.

(సశేషం)




No comments:

Post a Comment