ముందుమాట:
పాఠకులందరకు మహాశివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలు ! లోగడ మనం కార్తీక మాస సందర్భం గా ప్రత్యేక వ్యాస పరంపర ద్వారా ఆ మహాశివుని స్మరించుకున్నాము. రేపు అనగా ఫెబ్రవరి 17 వ తారీఖున మనం మహాశివుని అరాదించుకుందాము.
పాఠకులందరకు మహాశివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలు ! లోగడ మనం కార్తీక మాస సందర్భం గా ప్రత్యేక వ్యాస పరంపర ద్వారా ఆ మహాశివుని స్మరించుకున్నాము. రేపు అనగా ఫెబ్రవరి 17 వ తారీఖున మనం మహాశివుని అరాదించుకుందాము.
రమణ బంధకవి
సంపాదకుడు
శివరాత్రి విశిష్టత
శ్రీమతి
నయన కస్తూరి
త్రిదళం, త్రిగుణాత్మకం, త్రినేత్రంచ, త్రియాయుధం!
త్రిజన్మపాపసంహారం, ఏక బిల్వం శివార్పితం!
హిందూ పండుగలలో శివరాత్రి ఒక ముఖ్యమైన పండుగ. "ముఖ్యమైన" అని ఎందుకన్నానంటే
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదంటారు. అందుకని మన జీవితాలు ఒడిదుడుకులు లేకుండా
ముందుకు సాగిపోవాలంటే ఆయన అనుజ్ఞ తప్పక అవసరం. ఆ పరమేశ్వరుని ప్రసన్నం
చేసుకోవడానికి శివరాత్రి పర్వదినం మంచి అవకాశాన్ని మనకి ప్రసాదిస్తుంది.
ముందుగా
శివరాత్రిని ఏ సందర్భంలో జరుపుకుంటామో చూద్దాం. ఈ పవిత్రమైన రోజునే పరమేశ్వరుని జననము, పార్వతీ పరమేశ్వరుల
కల్యాణం జరిగినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఈ పండుగ ప్రతి సంవత్సరం మాఘ
మాసంలో బహుళ పక్షం లో మాసశివరాత్రి నాడు
జరుపుకుంటాము.
శివరాత్రి
నాడు భక్తులు వేకువజామునే లేచి, తల మీద స్నానం చేస్తారు. నదీ
స్నానమైతే మరీ పుణ్యం. ఎవరైతే శివరాత్రి నాడు ఈ
విధంగా "శివ ....శివ"
అంటూ తలారా స్నానం చేస్తారో, వారు పవిత్ర గంగా నదీ
స్నాన పుణ్యం పొంది తీరుతారు. ఆ నాడు శివాలయాలకు వెళ్లి, శివుని దర్శనము, అభిషేకాలు, అర్చనలు జరిపించుకుంటారు. మహేశ్వరుని అర్చనలో
బిల్వపత్రానికి ఒక విశిష్ట స్తానం వుంది. ఈ బిల్వపత్ర పూజ అంటే ఆ చంద్రశేఖరునికి అత్యంత ప్రియం. ఉపవాసాలుంటారు, రాత్రి
పండ్రెండు గంటలకు లింగోద్భవ కాలం లో శివుడికి అభిషేకాలు చేసి పార్వతీపరమేశ్వరుల
కల్యాణం భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. విశ్వనాధుని ద్యానించుకుంటూ జాగరణచేస్తారు. ఈ
పండుగను పెద్ద చిన్న బీద, గొప్ప తారతమ్యంలేకుండా అందరూ భక్తిశ్రద్ధలతో, నియమ
నిష్టలతో జరుపుకుంటారు.
శివరాత్రి
నాడు భక్తిశ్రద్ధలతో శంకరుని ఆరాధిస్తే ఎంతటి పాపమైనా హరించి మోక్షాన్ని
ప్రసాదిస్తాడు ఆ పార్వతీపతి. ఈ విషయాన్ని మన పురాణాలలోని ఎన్నో కథలు గుణవంతుడు, భక్తకన్నప్ప మొదలగు వారి కథలు కూడా బలపరుస్తున్నాయి.
ఇక లింగోద్భవ
కాలం విశిష్టత వివరించవలసి వుంటుంది. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య 'ఎవరు
గొప్ప?' అనే వివాదంలో శివుడు మధ్యవర్తిత్వం వహించి, "ఎవరు నా
తుది కాని, మొదలు కాని కనిపెడతారో వారే గొప్ప" అని చెప్పి లింగరూపంలో పెరిగిపోతూ ఉంటాడు. బ్రహ్మ మొదలు చూడటానికి పాతాళలోకానికి, విష్ణువు ఊర్ధ్వ లోకాలకు పయనించారు . కానీ వారు తమ ప్రయత్నంలో
విఫలమైనారు. బ్రహ్మ మొగలిపూవు, ఆవుల అబద్ధపు సాక్ష్యాలతో కనిపెట్టానని అసత్యం
పలికాడు. ఆవు అవునని మొహంతో అసత్యం, తోకతో కాదని నిజం
చెప్పడంతో ఆవు తోక పూజ్యనీయమైంది. మొగలిపూవు, ఆవు ముఖము
పూజకు అనర్హమని పరమేశ్వరుడు ఆగ్రహంతో శపించినాడు. శివుడిని, ఆ సమయంలో శాంతింప చేయడానికీ అభిషేకం చేయడంతో ఆ
ఆచారమే ఇప్పటికీ కొనసాగుతోంది. బ్రహ్మ, విష్ణువులు కూడా శివుడు లింగ రూపంలోనే పూజలందు
కోవాలని అన్నారు.
బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం!
జన్మజ ధు:ఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం!!
మన
దేశమంతటా కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఎన్నో శివక్షేత్రాలు కలవు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు
కలవు. ఆంధ్ర ప్రదేశ్ లో శివుని పంచారామాలు వున్నాయి. అన్నిచోట్లా శివరాత్రి
సందర్భంగా ఎన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. స్త్రీలు ఏమైనా నోములు
చేయదలుచుకుంటే ఈ రోజే సంకల్పం చెప్పుకుంటారు. శివునికి
ఆదిభిక్షువు, సాంబశివుడు, జటాధరుడు, నీలకంటుడు...ఇలా అనేక పేర్లతో పిలవబడతాడు. బోళాశంకరుడని కూడా పిలుస్తారని మనకందరికీ తెలుసు. చాలా తొందరగా, సులభంగా భక్తులకు ప్రసన్నమై అందరి కోరికలు తీరుస్తాడు. అనారోగ్యంతో బాధపడేవాళ్లకి శివ నామ
స్మరణం దివ్యౌషధం. మనమందరం కూడా రేపు అనగా 17 వ తారీఖున శివరాత్రి పుణ్యదిన సందర్భంగా పార్వతీ పరమేశ్వరులని పూజించి, వారి అనుగ్రహం పొందుదాం. శివ పంచాక్షరీ మంత్రం "ఓం నమశ్శివాయ" జపిస్తే
పంచ మహాపాతకాలు పటాపంచలు అవుతాయి.
No comments:
Post a Comment