Tuesday, February 3, 2015

కామాక్షి కబుర్లు: రామేశ్వరం యాత్ర – బియ్యపు పిండి రొట్టె – ఆవకాయ బద్ద! - మొదటి భాగం


ముందుమాట:
ఒక రోజు కామాక్షి గారింట్లో, మధ్యాహ్నం చక్కని ‘తెలుగు భోజనం’ కానిచ్చి, లక్ష్మీ కాంతం గారు రామకోటి వ్రాసుకుంటున్న వేళ, ప్రత్తివత్తులు చేసుకుంటున్న సూరీడమ్మ గారు రామేశ్వర యాత్ర ప్రస్తావన చేసేరు. మరి ప్రయాణం అంటే పలహారాలు ఉండాల్సిందే కదా? దాని మీద తర్జన బర్జనలు, వాదోప వాదాలు ఇక తప్పవు.  ఇక ఈ యాత్ర పూర్తి అవటానికి ఎన్ని రోజులు పడుతుందో, మరి రామేశ్వరం చేరే వరుకు, మరి తిరిగి వచ్చేప్పుడు, పంటి క్రింద నలగటానికి ఏ యే ఉపాహారాలు  అత్తా కోడళ్ళు కలిసి చేసుకున్నారో తెలుసుకుందామా? మీ సంగతి తెలియదు కానీ నాకైతే నోరూరిపోతోంది. ఇక దాని కధా కమామిషు చూద్దామా?

రమణ బంధకవి

సంపాదకుడు

  
రామేశ్వరం  యాత్ర – బియ్యపు పిండి రొట్టె – ఆవకాయ బద్ద! - మొదటి భాగం

శ్రీమతి రత్నాశ్రీనివాస్

"ఈ సారైన రామేశ్వరం వెళ్లి వస్తే, మనసులో వున్న గునుపు కాస్త తీరిపోతుంది ఏమంటారు"? రామకోటి రాసుకుంటున్నలక్ష్మి కాంతం గారిని అడిగేరు సూరిడమ్మ గారు
"అంత ప్రయాణం చేయగలవా"? రాసుకుంటూనే అడిగేరు లక్ష్మీ కాంతం గారు. 
"చేస్తే కళ్ళు, కాళ్ళు సరిగ్గా ఉన్నపుడే చేయాలి. అంతకంతకు పెద్దవాళ్ళం కావటం లేదూ? అయినా విశ్వం, కామాక్షి పక్కనే వుంటారు కాబట్టి ప్రయాణం చేయలేననే ఆధైర్యం వుండదు" ధీమాగా అన్నారు
"ముందు విశ్వానికి సెలవు పెట్టడానికి వీలవుతుందో లేదో అడగాలి" రామకోటి పూర్తి చేస్తూ అన్నారు

సాయంత్రం విశ్వనాథం ఆఫీస్ నుండి రాగానే సూరిడమ్మ గారు “విశ్వం ఒక వారం ఆఫీస్ కి సెలవు పెట్టడానికి వీలయితే రామేశ్వరం వెళదామని వుందిర”! అన్నారు. ఏ కళనున్నాడో విశ్వనాథం వెంటనే ఒప్పుకున్నాడు. “సరే అమ్మా! శని ఆదివారాలు కలిసి వచ్చేలాగ వెళ్ళితే నాకు సెలవు పెట్టడానికి తేలిక అవుతుంది. అసలు ముందు టికెట్ దొరకాలిగ!” అని ఇంటర్నెట్ లో టికెట్ల కోసం ప్రయత్నించాడు.

లక్ష్మీ కాంతం గారు చెవిలో మిషను పెట్టుకోవటానికి వెళ్ళేరు. వినిపించక రెండవసారి అడిగితే విశ్వనాథం విసుక్కుంటాడు. చెవిలో మిషను పెట్టుకోవడం లేదా నాన్న? అంటాడు. ఆయన విశ్వనాధానికి ఒక్కడికే భయపడతారు.
“ఎరా! టికెట్లు దొరికేయా!” మిషను సరి చేసుకుంటూ అడిగేరు.
“మనం రామేశ్వరం వెళ్ళాలంటే చెన్నై వెళ్లి, అక్కడ నుండి ట్రైన్ ఎక్కాలి నాన్నా. అమ్మలు ఇంట్లో దిగుదాము. దాన్ని కూడా చూసినట్లు అవుతుంది” అన్నాడు విశ్వనాథం. అమ్మలు విశ్వనాధానికి స్వయానా అక్కగారు. చెన్నై లో వుంటుంది.
“మరి ఇంకనే! అది వస్తానంటే దాన్ని కూడా కలుపుకుని వెళ్ళితే సరి!” అన్నారు మావ గారు.
“ఆ!....అది రాదు! దానికెక్కడ కుదురుతుంది? మావగారు మంచంలో వున్నారాయే! అత్తగారికి కళ్ళు సరిగ్గా కనపడవు. అట్లాంటి వాళ్ళని అల్లుడు మీద వదిలి పెట్టి ఎలా వస్తుంది?” అన్నారు అత్తగారు.

విశ్వనాథం అమ్మలు కి ఫోన్ చేసేడు. రామేశ్వరం ప్రయాణం పెట్టుకున్నామని, చెన్నై మీదుగా వెళతామని, తను కూడా వస్తానంటే తమతో తీసుకుపోతామని చెప్పేడు. అమ్మలు తను రాలేనని, అంత మాత్రానికి చెన్నై రావడం మానుకోవద్దని, వాళ్ళు వస్తే తను ఎంతగానో సంతోషిస్తానని, అందరం సరదాగా గడుపుదామని, రెండు రోజులైనా ఉండేటట్లు రమ్మనమని మరీ మరీ చెప్పింది.
విశ్వనాథం చెన్నై వరకు కార్లో వెళ్లి, అమ్మలు ఇంట్లో కారు వదిలి, అక్కడ నుండి రామేశ్వరం రైల్లో వెళదామని చెప్పేడు.
“సరే! అదే ఖాయం చేయరా!” అంటూ చెవిలోంచి మిషను తీస్తూ  లేచేరు మావగారు.
“క్రింద బెర్తులు తీసుకో నాయనా! ఎత్తు మీదవి వస్తే పెద్దవాళ్ళం ఎక్కలేక  అవస్త పడాలి” గుర్తు చేసేరు అత్తగారు.

విశ్వనాథం చెన్నై నుండి రామేశ్వరానికి రాను పోను టికెట్లు కొన్నాడు. పెద్ద వాళ్ళిద్దరికీ క్రిందవి వచ్చేయని, కామాక్షికి, పట్టుకి మధ్యవని, తనకి పై బెర్తు అని చెప్పేడు.
“నడుము నెప్పి అంటుంటావు! మధ్యది ఎక్కగలవుటే?” అన్నారు కామాక్షితో.
“మధ్యది వరకు పర్వాలేదు అత్తయ్య! పైన వస్తేనే ఇబ్బంది” అంది కామాక్షి.

పుణ్యక్షేత్రం దర్శనంతో పాటు కూతురుని కూడా చూసి రావచ్చని సంతోషించారు సూరిడమ్మగారు. (సశేషం)



No comments:

Post a Comment