Tuesday, January 27, 2015

రోటి పచ్చళ్ళలో తలమానికం - దోసకాయ పచ్చడి


ముందుమాట:

దోసకాయ తెలుగు వారికి ఎంత ప్రీతిపాత్రమో చెప్పక్కర్లేదు. దోసకాయ తొ ఏ పదార్ధం చేసినా దర్జాగా నే ఉంటుంది. పప్పు, పచ్చడి, కూర, ఆవకాయ, పులుసు... మరి ఏది చేసినా అదొక ప్రత్యేకత సంతరించు కుంటుంది.  తెలుగు వారి హృదయాలలో మామిడి  కాయ తరువాతి స్థానం దోసకాయదే అని చెప్పటం అతిశయోక్తి కాదు. లోగడ మనం మనసును దోచే దోసావకాయ గురించి తెలుసుకున్నాం. మరి ఈ సంచికలో రోటి పచ్చళ్ళలో తలమానికం అయిన దోసకాయ పచ్చడి గురించి చెపుతున్నారు శ్రీమతి రత్న.

రమణ బంధకవి

సంపాదకుడు



దోసకాయ పచ్చడి


శ్రీమతి రత్నా శ్రీనివాస్


దోసావకాయ రుచులను ఇదివరలోనే తెలుసుకున్నాం గాబట్టి, ఇపుడు దోసకాయ పచ్చడి గురించి తెలుసుకుందాం. ఇది చేయటం చాల తేలిక. చదివాకా ‘ఓ ఇంతేనా?’ అనుకున్నా పరవాలేదు కాని రుఛి చూసి ‘ఇదేనా?’ అని మాత్రం ఎవరూ అనరని నా నమ్మకం!

తయారు చేయటానికి పట్టే సమయం:  15 నిమిషాలు 

కావలసిన పదార్దములు: 
దోసకాయ                                                                  1
చింతపండు                                                                కొంచెం 
ఉప్పు                                                                       తగినంత 
పసుపు,పంచదార                                                        చిటికెడు 

పోపుకు కావలసిన పదార్దములు:
నూనె                                                                        1 టేబుల్ స్పూన్ 
ఎండు మిర్చి                                                              4
మినపపప్పు                                                              1 టేబుల్ స్పూన్ 
ఆవాలు                                                                     1 టీస్పూన్ 
ఇంగువ                                                                     తగినంత 
పచ్చిమిర్చి                                                                3
కొత్తిమీర                                                                    కొంచెం 

తయారు చెయు విధానము :
పచ్చగా గుండ్రం గా ఉన్న దోసకాయను ఎంచుకోండి. కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరిగే సమయం లోనే, ముక్క రుచి చూసి చేదు లేదని నిర్ధారించుకోవాలి. గింజలు కావాలనుకునే వారు ఉంచుకోవచ్చు. లేని పక్షంలో పూర్తిగా తీసేయాలి. తరిగిన ముక్కలపైన పసుపు, ఉప్పు, పంచదార వేసుకోండి. చింతపండు కడిగి అది కూడా వేసుకోవాలి.

ఓకే చిన్న పోపు మూకుడును తీసుకుని, నూనె వేసి, వేడేక్కేక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు చల్లారక, కొంచెం పోపును పక్కన పెట్టుకుని, మిగతా పోపును బరకగా గ్రైండ్ చేసుకుని, దానికి పచ్చి మిర్చి, చింత పండు, కొత్తిమెర జతచేసి మల్లి రుబ్బుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలను కూడా కలిపి నలిగీ నలగనట్లు  ఒక సారి తిప్పి తీసేసుకోవాలి. 

పాతకాలం రోలు ఉన్నవారు, చక్కగా ఈ మిశ్రమాన్ని, ముక్కలను రోటిలో వేసుకున్ని, కచ్చ పచ్చగా దంచుకుంటే అద్వితీయంగా ఉంటుంది. మిక్సీ లో తిప్పుకునే వారు బహు జాగ్రత్తగా తిప్పుకోవాలి. లేకపోతే పలుచగా జావ లాగ అయిపోతుంది.  తయారైన పచ్చడిని శుబ్రమైన గిన్నె లోకి తీసుకుని, వేరే అట్టే పెట్టిన పోపును పైన వేసి అందంగా అలంకరించుకోవాలి. ఇక నోరూరించే దోసకాయ పచ్చడి తయార్! దీన్ని వేడి అన్నంలోకి నేయి జోడించి తింటే అద్భుతః













No comments:

Post a Comment