Friday, January 23, 2015

మరుగున పడుతున్న మన పర్వ దినాలు: చదువుల తల్లి పుట్టిన రోజు – శ్రీ పంచమి


ముందుమాట: 
రెండున్నర దశాబ్దాల క్రిందట మాట; నేను ఉద్యోగ రీత్యా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నప్పుడు, ప్రతి ఏట మాఘ పంచమి నాడు ఎంతో భక్తి శ్రద్దలతో విశేషంగా జరపబడే సరస్వతి పూజ నాకు బాగా గుర్తు. ఆ రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవ ఉండేది. అందరూ ఆ చదువులతల్లి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరుపుకునే వారు. ఈ నాటి రోజులలో ఈ పండగ కొంచెం మరుగున పడిందనే చెప్పవచ్చు.  విద్యా, విజ్ఞాన, వాక్పటిమలను మరియు ధారణ శక్తిని ఇచ్చి మనకు సరైన దారి చూపించే ఆ తల్లి జన్మదిన విశేషాలను మన ‘తెలుగు భోజనం’ పాఠకులకు శ్రద్దగా వివరిస్తున్నారు శ్రీమతి నయన. చదివి ఆ తల్లిని పూజించి తరించుదాము. 

రమణ బంధకవి

సంపాదకుడు

 

‘శ్రీ పంచమి లేక వసంత పంచమి’


శ్రీమతి నయన కస్తూరి


మహా పవిత్రమైన మాఘ మాసం లో మనం జరుపుకునే విశేష పర్వదినములలో  తొలుతగా వచ్చేది 'శ్రీ పంచమి'.  ఈ పర్వదినం గురించి చాలా మందికి తెలిసేవుంటుంది. అయితే ఈ ఆధునిక యుగం లో మనకు వేరే ఆరాటాలు ఎక్కువై కొన్ని పాశ్చాత్య పండుగల అనుకరణ లో పడి మనవైన  చాలా పర్వదినాలను ఒక విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామనే చెప్పుకోవాలి. అట్టి వాటిలో శ్రీపంచమి ఒకటి. శ్రీపంచమి ఏమిటో ఎప్పుడు ఎలా జరుపుకోవాలో ఒక్క సారి గుర్తు చేసుకుందాము. ప్రతీ చాంద్రమాన సంవత్సరం లోని మాఘమాసం లోని ఐదవ రోజు అంటే శుక్ల పంచమి నాడు ఈ పర్వదినాన్ని ఆచరిస్తాము.  ఈ రోజు యొక్క విశేషమేమంటే చదువులతల్లి, సకల కళారాణి అయిన  సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజు గా పరిగణింప బడే రోజు! ఈ రోజు పిల్లల చేత సరస్వతీ దేవి పూజ చేయిస్తే పిల్లలు చక్కగా చదువుకుని జీవితంలో పైకి వస్తారని హిందువుల ప్రగాఢ విశ్వాసం! 

'శ్రీ పంచమి' నే 'వసంత పంచమి' అని,సరస్వతీపూజ' అని కూడా పిలుస్తారు. నిజానికి మాఘ ఫాల్గుణ మాసాలు  శిశిర ఋతువు కాలం. అయితే మరి ఈ మాఘ శుక్ల పంచమిని వసంతపంచమి అని అనడం  ఏమిటిన్న సందేహం మీకు కలగవచ్చు. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలిపోయి కొత్తచిగుళ్ళు  రావడం మొదలుపెడతాయి. వాతావరణం అంతా ఆహ్లాదకరం గా వుండి వసంత ఋతువు రాకకు ఎన్నో సంకేతాలు ఈ మాసం లోనే మనకు కనిపిస్తాయి. అందుకని సరస్వతీ దేవి పుట్టినరోజైన ఈ పంచమిని  'వసంత పంచమి' అని కూడా అంటారు. సరస్వతీ దేవి పుట్టినరోజు కనుక విశేషంగా ఈ దేవి ఈ రోజున పూజలందుకుంటుంది కనుక 'సరస్వతీ పూజ'అని పిలువబడుతుంది.

అన్ని సరస్వతీదేవి ఆలయాల్లో ఈ రోజు విశేష పూజలు నిర్వర్తిస్తారు. భక్తులందరూ తమ పిల్లలతో సరస్వతీ దేవి పూజలు చేయిస్తారు. చిన్న పిల్లలకైతే ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేయిస్తే తమ పిల్లలు ఉన్నత విద్యలు అభ్యసిస్తారని, చదువుల తల్లి అనుగ్రహం పొందుతారని తల్లితండ్రుల నమ్మకం! అంతే  కాకుండా వాగ్దేవి అనుగ్రహంతో సంగీతము, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం... లాంటి ఎన్నో కళలలో ఉన్నతస్థాయిని అధిరోహిస్తారని హిందువుల విశ్వాసం! అందుచేత ప్రతి ఒక్కరు సరస్వతీదేవిని ఆశ్రయిస్తారు. విశేషించి ఈ శ్రీ పంచమి నాడు అమ్మ వారికి అభిషేకాలు జరిపి నిజ రూపానికి హరిద్రాలంకారం అంటే పసుపు అమ్మవారికి వంటినిండా అలది కొంచెం సేపు అందరికి హరిద్రదర్శనం గావిస్తారు. ఈ అలంకరణ లో అమ్మవారి దర్శన భాగ్యం ఎంతో జయప్రదం మరియు పుణ్యప్రదం అని భావిస్తారు. భక్తులు తండోప తండాలుగా అమ్మవారి ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యార్ధుల చేత సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. వార్షిక పరీక్షలముందు ఈ పండుగ రావడం వలన, విద్యార్ధులందరూ కలిసి చేసుకోవడం వలన, తోటి విద్యార్ధులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకోవడమే కాకుండా కొత్తపద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకుని రిలాక్స్ అవుతారు. ఆరోగ్యకరమైన పోటీ పడతారు. తోటి విద్యార్ధుల నుండి ప్రేరణ పొందుతారు. మార్చ్, ఏప్రియల్ లో స్కూల్స్ లో కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్స్ జరుగుతాయి కనుక దాని ముందుగా వచ్చే ఈ శ్రీపంచమి నాడు అక్షరాభ్యాసాలు, పూజలు చేసుకుని చదువుల పోరాటానికి సంసిద్దులవుతారు.

ఈ రోజు అమ్మవారికి పసుపురంగు ప్రీతికరమైనందున భక్తులు వీలైనంతవరకు పసుపురంగు వస్త్రాలు ధరించి, పసుపు వేసిన పులగాన్నాన్ని నివేదన చేస్తారు. పులగాన్నం తయారీని మన దసరా నవరాత్రులలో నేర్చుకున్నాం కదా? ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. 

ఇంత  విశిష్టమైన సరస్వతీదేవి పుట్టినరోజుగా పరిగణింప బడే 'శ్రీ పంచమి' ఈ నెల అనగా జనవరి 24 మరియు 25 తేదీలలో [రెండు రోజులలో పంచమి ఘడియలు ఉన్నందున] పడినందున అందరు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కోలుచుకుని, ఆ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాము. 




No comments:

Post a Comment