Tuesday, January 13, 2015

సంక్రాంతి – క్రాంతి


ముందు మాట: 
సంక్రాంతి పండుగ అంటే పొంగిపోని తెలుగు హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి ముంగిట రధం ముగ్గులు, గొబ్బెమ్మలు, వీధి వెంట హరిదాసులు, గంగిరెద్దు మేళాలు, పట్టు పరికిణీ ఓణీలు, కొత్త ధోవతులు, పై పంచలు, పట్టు చీరలు, కొత్త నగలు, కొత్త జంటల కిలకిలా రావాలు, డబ్బాల నిండా అరిసెలు, పోకుండలు, నూపప్పు ఉండలు, పొయ్య మీద పొంగుతున్న కొత్త బియ్యపు పొంగళ్ళు, గాదె నిండిన ధాన్యాలు ....అబ్బో ఇలా ఎన్నో! పండగ రోజులలో పొంగి పొరలే ఆనందోత్సాహాలు గుండె లోతులనుండి వచ్చి ఏటి పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది! మరి సంతోషాల క్రాంతి ఎలా ఎపుడు వస్తుంది? ఇంటువంటి ఆలోచన నుండి పుట్టిందే యీ చిరు కవిత. ఆశ్వాదిస్తారని ఆశిస్తూ... సంక్రాంతి శుభాకాంక్షలతో!

రమణ బంధకవి

సంపాదకుడు


సంక్రాంతి - క్రాంతి

చలి మంచు కెరటాల తడిసి గజ గజ లాడింది లోకం,
మసక వెలుగుతో నిద్రలేచాడు వణుకుతూ దివాకరం,
వీధిన కదిలాడు హరిదాసు చేస్తూ దివ్యనామ స్మరణం,
సన్నాయి రాగం తో వయ్యారంగా కదిలింది గంగిరేద్దుల మేళం.

వీధి వీధిన చిరు చీకటి లో రగిలాయి భోగి మంటలు,
ఇంటింట గాదెల్లో నిండాయి సరి కొత్త పంటలు,
ఆనందాలు ఆత్మీయతలు పంచంగ వచ్చారు కొత్త జంటలు,
వంటిళ్ళ పోరిలాయి అరిశ, బొబట్లు మరెన్నో తీపి వంటలు.

పిల్ల పాపల తలల నుండి జారు వాలే ఆశీసుల భోగి పళ్ళు,
ఆబాల గోపాలం తొడిగేరు కొత్త దుస్తులు చెదరంగా కళ్ళు,
ఇంటింట తుళ్ళేను అశల, ఆనందాల సరదాల పరవళ్ళు,
ఆత్మ రాముని సేవకు వచ్చెను పులిహోర బొబ్బట్లు, గారే ఆవళ్ళు.

ఏటేట వచ్చి మురిపించెను ఈ ఆనందాల సంక్రాంతి,
ఏనాడు నింపునో మసక మనస్సులో ప్రేమానురాగాల కాంతి,
రగిలే భోగి మంటల్లో ఎపుడు మండేనో స్వార్థ చింతనల బ్రాంతి,
ఆనాడే నిజమైన సంక్రాంతి ...మానవత్వం తెచ్చే శాంతి – క్రాంతి!

-రమణ బంధకవి


No comments:

Post a Comment