Saturday, January 24, 2015

మరుగున పడుతున్న పర్వదినాలు — రధసప్తమి


ముందుమాట: 
మనం  ఇటీవలే మరుగున పడుతున్న కొన్ని పర్వదినాలను వెలికి తీసే ప్రయత్నం చేసాము కదా? నిన్ననే శ్రీ పంచమి గురించి చెప్పుకున్నాం. అలాంటి జాబితాలో మనం ఆధునిక వ్యామోహం లో వదిలేసిన ధార్మిక పరంగానూ శాస్త్ర పరం గానూ కూడా ఎంతో అర్ధవంతమైన ఆధ్యాత్మిక పర్వదినం 'రధసప్తమి'కూడా ఉందని చెప్పుకోవచ్చు. తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం నుండి మీరు పవిత్ర మైన ఈ పండుగ ‘రధసప్తమి’ ని ఆచరించి, మీ పిల్లలకు కూడా తెలియజేయండి. ఎలా? అని అనుకుంటున్నారా? “ఎందుకు మీకా చింత? 'తెలుగుభోజనం' వుండగా మీ చెంత!”  మీకు 'రధసప్తమి' యొక్క విశిష్టత, ఆచరించే విధి విధానం, శాస్త్రీయ దృక్పధం,  సమయం .... మొదలైన సమాచారం తో అందిస్తున్నారు శ్రీమతి నయన కస్తూరి.


రమణ బంధకవి


సంపాదకుడు



‘రధసప్తమి’

శ్రీమతి నయన కస్తూరి

మాఘమాసం లో ఏడవ రోజైన శుక్ల సప్తమి నాడు హిందువులు ఈ పండుగ చేసుకుంటారు. సూర్యభగవానుడు తన సప్తాశ్వరధం మీద ఉత్తరాయణంలో ఈశాన్య దిశగా పయనం సాగిస్తున్న సందర్భం లో ఈ రోజున సూర్యారాధన కావిస్తారు. ఇదే రోజున కశ్యపునికి, అదితికి సూర్యభగవానుడు జన్మించాడని భావించి, భక్తీ శ్రద్ధలతో సూర్య జయంతి ని కూడా జరుపుకుంటారు.

ఇప్పుడు రధసప్తమి పూజా విధానం చూద్దాం. ఈ రోజు సూర్యోదయానికి ముందరే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, రధసప్తమీ స్నానాలు చేస్తారు. అవకాశం ఉన్న వారు నదీస్నానం, సముద్రస్నానం చేస్తారు. ఇలా చేయడం వలన ఏడుజన్మలనుండి  వెంటపడుతున్న పాప సముదాయం నుండి కూడా విముక్తి పొందగలరుట. అంతటి మహదావకాశం అందరికి దొరుకుట  దుర్లభం! ఒప్పుకుందాం. అందుకే దయాహృదయుడు అయిన ఆ భగవంతుడే ఫలితంలో ఏ మాత్రం లోపం లేకుండా ఎన్నో సులభ మార్గాలు మనకు అందుబాటులో ఉంచుతాడు. అరుణోదయానికి ముందే రధసప్తమి నాడు లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, జిల్లేడు ఆకులు కాని, రేగిపళ్ళు కాని శిరస్సున దాల్చి, ఈ క్రింది శ్లోకాన్ని పటిస్తూ తల స్నానం చేస్తే మీ పాపాలన్ని పటాపంచలు  అయిపొతాయి. మరి అయితే ఆ శ్లోకం ఏమిటో ఒకసారి చూద్దామా?

"యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తస జన్మసు,
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ!"

అయితే మరి రధసప్తమి నాడు ఈ విధం గా స్నానం ఆచరించి, ఏడు జన్మల పాపాలనుండి విముక్తి పొందుదాం.   

ఇక సూర్యోదయం అవగానే ఇంటి ఆవరణలోనే ఉన్న తులసి మొక్క చెంత ఏడు  పద్మాలు బియ్యం పిండితో ముగ్గుగా వేసి రెండేసి చిక్కుడు కాయలను రెండేసి చిన్న పుల్లలతో కలిపి అలా తొమ్మిది జతల చిక్కుళ్ళ తో ఏడు  అశ్వాలు కలిసిన రధం లాగా తయారుచేసి, ఒక చిక్కుడు ఆకుమీద ఒక ఎర్రపుష్పాన్ని సూర్యునికి ప్రతినిధిగా కుంకుమ గంధాలతో అలంకరించాలి. ధనుర్మాసం అంతా పిడకలుగా చేసిన గొబ్బెమ్మలతో అగ్నిని ప్రజ్వరిల్లంప చేసి, దాని మీద ఆవుపాలుని పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పరమాన్నం చేసి చిక్కుడు ఆకులో సూర్యభగవానుడికి నివేదన చేసి, ప్రసాదం గా కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు. చిక్కుడు ఆకులే ఎందుకు? అని మీలో ఒక సందేహం ఉదయించవచ్చు. ప్రస్తుతానికి నా సమాధానం ఏమిటంటే, మన సంప్రదాయం ఏదైనా దానికి శాస్త్రీయపరమైన కారణం వుంటుంది. అప్పుడే చిక్కుడు కాయల కాపు మొదలవుతుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన కాయగూర చిక్కుడు. అది మనం మర్చిపోకుండా సూర్యారాధన లో పొందుపరిచారు. దీని గురించి ఇంకొంచెం వివరంగా ఇంకోసారి ఎప్పుడైనా తెలుసుకుందాం. సూర్యరశ్మి ఎన్నో రోగాలను హరించే శక్తి కలిగి వుంటుంది. సూర్యరశ్మి లేకపోతె జీవశక్తి మనలేదు. రకరకాల వ్యాధులు సోకుతాయి. ప్రాతఃకాలం లోని సూర్యరశ్మి లో  'డి' విటమిన్ పుష్కలం గా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గరనుండి ‘ఏసీ’ లకు కంప్యూటర్లకు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి, అవుట్ డోర్ గేమ్స్ ని పూర్తిగా మర్చిపోయి సూర్యరశ్మి ఏ మాత్రం శరీరానికి సోకకుండా వుండటం వలన అందరికి 'డి'విటమిన్ తగ్గిపోయి అనేక ఎముకల రోగాలకు దారి తీస్తోంది. చలికాలం లో కలిగే రుగ్మతలను తర్వాత వచ్చే వేసవికాలం చాలా వరకు అరికడుతుంది. రధసప్తమి తర్వాత వాతావరణం లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆరుబయట అర్చన మన శరీరాన్ని పెరగబోయే  ఉష్ణోగ్రతల కు  అలవాటు చేస్తుంది. మనం మనిష్టమొచ్చిన విధంగా సహజవనరులను దుర్వినియోగం చేస్తే వాతావరణం లోని సమతుల్యత దెబ్బతిని, అన్ని కాలాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. అది మనం గ్రహించి, గుర్తు పెట్టుకోవడానికే మనం సంప్రదాయం, మన పెద్దలు ఎంతో శాస్త్రీయపరం గా ఆలోచించి, మన పండుగలలో ప్రకృతి ఆరాధనను  అంతర్భాగం గా చేసారు. 

రధసప్తమి యొక్క ఇంకొక విశిష్టత ఏమిటంటే మన స్త్రీలు ఎన్నో నోములు నోస్తూ వుంటారు కదండీ? వారు ఆ నోములు ఈ రోజే సూర్యభగవానుని సాక్షిగా పెట్టుకుని తాము  చేసుకోబో యే నోములకు సంకల్పం చెప్పుకుని ప్రారంభిస్తారు. ఏ కారణం చేతనైనా ఈ రోజు ప్రారంభించలేని వారు మాఘ మాసం లోని ఏ ఆదివారం నాడు అయినా లేక మహా శివరాత్రి నాడు అయినా ప్రారంభించు కోవడం మన ఆచారం!

ఇంతటి విశిష్టత కలిగిన రధసప్తమి ఈ నెల అనగా జనవరి 26 న పడింది. మరి మర్చిపోకుండా ఆ రోజు మన ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలతో పాటు  యధాశక్తి  సూర్యభగవానుని ఆరాధించి "ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్” అని మరిచిపోకుండా నిత్యం సూర్యనమస్కారాలు చేసుకుంటూ  ఆరోగ్యమనే మహా భాగ్యాన్ని పొందుదామా?







No comments:

Post a Comment