Sunday, January 18, 2015

‘నేతి బీరకాయ, పెరుగు తోట కూర’


నేతి బీరకాయలో నెయ్య ఎంత ఉంటుందో పెరుగు తోటకూరలో పెరుగు అంత ఉంటుందనటం సహజం. సాధారణం గా వీటిని ఎవరైనా అతిశయోక్తులు, వొట్టి కబుర్లు చెబుతున్నప్పుడు వారిని ఉద్దేశించి వాడతాం. అది పక్కన పెడితే, లేత బీరకాయ తో వంటకాలు అనగా పోపుకూర, పొడుం కూర లేక పచ్చడి చేస్తున్నప్పుడు కాని, లేతగా నవనవ లాడే తోటకూర తో పులుసు లేదా పప్పు లేదా ఇగురు చేస్తున్నప్పుడు కానీ అవి నెయ్యి మరియు పెరుగు వాడి చేసినంత కమ్మగా ఉండటం మన అందరికి పరిచితమే! ఈ విషయాన్ని గురించి పెరుగు పచ్చడి లో నేతి తాలింపు వేసినంత కమ్మగా వివరిస్తున్నారు శ్రీమతి పద్మ.

రమణ బంధకవి

సంపాదకుడు



‘నేతి బీరకాయ, పెరుగు తోట కూర’


శ్రీమతి పద్మా రఘునాద్


"నేతి బీరకాయ లో నేయి ఎంత ఉంటుందో, పెరుగు తోట కూరలో పెరుగు ఎంత ఉంటుందో, వాళ్ళ మాటల్లో కూడా అంతే నిజముంటుంది నువ్వు ఏమాత్రం నమ్మవద్దు సుమీ!"  అనే నానుడిగా ఉన్న సలహాని మనం అపుడపుడు కొన్ని సందర్భాలలో వింటూనే ఉంటాము. అంటే కొంతమందికి, తాము ఎవరికైనా ఏదైనా జరిగిన విషయమ లేదా సంఘటన గురించి చెప్పేటపుడు అందులోని అసలు యదార్ధం మరుగున పడిపోయేలాగా వారి ఊహలని, ఆలోచనలని, వేరే వారి చెప్పుడు మాటలని, వారి సొంత అభిప్రాయాలని కూడా బాగా జోడించి చెప్పే అలవాటు ఉంటుంది. అంటే ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేసి చెప్పటం లాంటిదన్నమాట.  అది ఒక వ్యక్తి గురించి కావచ్చుఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు, ఒక సమస్య లేదా పరిస్థితి గురించి కూడా కావచ్చు.   అలాంటి మాటలు నమ్మటం వలన మనం సొంతంగా  అభిప్రాయాలు ఏర్పరచుకోలేక ఇబ్బంది పడి, వారు మనకు పరిస్థితి ని ఎలా వివరించారో, అలాగే  ఉహించుకుని, అదే నిజమని అభిప్రాయపడే ప్రమాదం కూడా కలుగుతుంది. కనుక ఏ అభిప్రాయమైనా ఎవరికి వారు సొంతంగా ఆలోచించుకుని, నిజ నిజాలు పరిశీలించి ఏర్పరచు కోవటం అన్ని విధాల మంచిది.

సరే ఇంక ఈ కూరల మాటకి వస్తే, బీరకాయలో నేయి లేకపోయినా అది వండినపుడు నేయి అంత కమ్మగా ఉంటుందనితోటకూరలో పెరుగు లేనప్పటికీ ఉడికిన తర్వాత  అది పెరుగు అంత మెత్తగా నోటికి తగులుతుందని మనందరికీ తెలిసిన విషయమే. 

ఈ రెండు కూరలు చాల సాత్విక మయిన భోజన ఆధారవుల కిందకే వస్తాయి. జ్వర పడి  కోలుకుంటున్న వారికయితే నేమి,  పధ్యం తో భోజనం చేసే వారి కయితే నేమి, రక్త పోటు ఎక్కువగా ఉన్న వారి కయితే నేమి, రక్తం తక్కువగా ఉండి  బలహీనం గా ఉన్న వారి కయితే నేమి, పిల్లలకు, పెద్ద వారికి, అందరకు చాల తేలికగా అరిగి పోయి శక్తి ని ఇచ్చే ఆహారాల కింద చెప్పుకోవచ్చు. వీటితో మన తెలుగు వారు రకరకాలయిన భోజనం లోకి ఆధారవులు కూడా చేసుకోవచ్చును. 

బీరకాయ విషయానికి వస్తే, దీనితో పొడి కూరలు, ముద్దకూరలు, పచ్చళ్ళు రకరకాల రుచి కరమయిన పదార్ధాలు చేసుకోవచ్చు. బీరకాయ తో శనగ పప్పు, మినప పప్పు వేయించి చేసిన పొడి కలిపిన కూర, ఉల్లి మసాలా వేసిన కూర, పాలు పంచదార కూర, టమోటా, ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపినా కూర, శనగ పిండి, జీలకర్ర, ఎండుకారం చల్లిన కూర ఇలా రకరకాల కూరలు చెసుకొవచ్చును.

బీరకాయ ముక్కల పచ్చడి, లేదా కొంచెం టొమాటో కూడా కలిపి చేసిన పచ్చడి, బీరకాయ అల్లం కలిపి కూడా పచ్చడి, ఆఖరుకి బీరకాయ పొట్టు తో కూడా పచ్చడి చేసుకోవచ్చు! అన్ని కూడా అచ్చం నేతి తో చేసిన వంటల రుచి వస్తుందంటే నమ్మండి!

అలాగే తోటకూర తో అల్లం పచ్చి మిర్చి కూర, పెసరపప్పు నాన వేసి అది కూడా కలిపిన కూర, ఉల్లిపాయలు, చింత పండు వేసి పులుసు కూర, అంతే కాకుండగా కొంచెం శనగ పిండి నీరు కలిపి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తో తోటకూర పులుసు, బాగా ఉడికించి, పోపు వేసి, అందులో కొంచెం పెరుగు కూడా కలిపి పెరుగు పచ్చడి ఇలా రకరకాల తెలుగు పదార్ధాలు మరిన్ని చేసుకోవచ్చు. ఒకసారి ఈ కూరలని వండి చూడండి! వాటి రుచి చూసి మీరే బీరకాయని ఎలా వండినా కమ్మటి నేతి రుచి, తోటకూరతో ఏ వంటకం చేసినా పెరుగు తిన్నంత మెత్తగా ఉంటుందని  అపుడు ఒప్పుకుంటారు. అదేకాకుండగా, ఈరోజు మా ఇంట్లో నేతి బీర కాయ కూర , పెరుగు తోటకూర పులుసు అని ధీమాగా మీరే చెప్తారు కూడా!






No comments:

Post a Comment