ముందుమాట:
మొన్నీ మధ్య మన పాఠకులొకరు మాకు హోటల్
ఇడ్లీ చట్నీ చేసే పద్ధతి తెలపవలసింది గా కోరారు. వారికోసమే కాక, ఇంట్లో చేసుకున్న
ఇడ్లీలకు జోడీగా, హోటల్ వారు చేసే పచ్చడి టేస్ట్ కి ధీటైన పచ్చడి రుచి చూడాలనే
కోరిక ఉన్న మిత్రులందరి కోసం ఈ రెసిపీ ఇవ్వడం జరిగింది.
ఇక కధాక్రమానికి వస్తే, ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ కి
ఇడ్లి చేసాను అనగానే హోటల్ లో చేసే సెనగ పప్పు(పుట్నాల పప్పు),కొబ్బరి చట్నీ గుర్తుకొచ్చి నోట్లో
లాలాజలం ఊరుతుంది. ఇడ్లీలు దూదుల్లా ఎంత మెత్త గా వున్నా సరే, అది తినాలంటే
సెనగ చట్నీ ఉండాల్సిందే చాల మందికి. కొందరు మహాశయులు కేవలం పచ్చడి కోసమే ఇడ్లీ
తింటారు. కొందరు పచ్చడి లేని ఇడ్లీ మీద వేలు కూడా వేయరు. పచ్చడి రుచిగా ఉంటే చాలు ఎన్ని వాయల ఇడ్లీలు అయిన యిట్టే అయిపోతాయి.
కొందరు ఇడ్లీల కన్నా పచ్చడే ఎక్కువ తింటారు. కొందరు అర ఇడ్లీ కే కప్పుడు పచ్చడి తినేసి
మళ్ళీ అడగటం, హోటల్ అబ్బి గుర్రు గా చూడటం కద్దు. పళ్ళెం లో పచ్చడి అయిపోయినా
నాకుతూ కూర్చుంటారు పాపం మరి కొందరు. ఇలాంటి గురుతర స్థానం కలిగిన ఇడ్లీ పచ్చడి
చేసే విధానం మన పాఠకుల కోసం అందిస్తున్నారు శ్రీమతి రత్న.
రమణ బంధకవి
సంపాదకుడు
ఇడ్లీ
చట్నీ అనబడే గుల్ల సెనగ పప్పు- కొబ్బరి పచ్చడి
శ్రీమతి రత్నా శ్రీనివాస్
ఇడ్లీ
చట్నీ అంటేనే గుల్ల సెనగ పప్పు, కొబ్బరి చట్నీ అని ఒక నిర్ధారణకి
వచ్చేస్తాము. ఒక విధంగా చెప్పాలంటే ఇడ్లీ -సెనగ చట్నీ
విడదీయలేని జంటగా చెప్పుకోవచ్చు . అంటే బాపు-రమణ గార్ల లాగ అన్న మాట. సరే అలాంటి
మేలు కలయిక గల సెనగ-కొబ్బరి చట్నీ అదేనండి ఇడ్లీ చట్నీ గురించి తెలుసుకుందాం!
తయారు చేయ విధానం:
గుల్ల
సెనగ పప్పు
1 కప్పు
కొబ్బరి
తురుము
1/2 కప్పు
పచ్చిమిర్చి
5-6
ఉప్పు
తగినంత
పోపుకి కావలసిన పదార్దములు :
ఎండు
మిర్చి
1
మినపపప్పు
1 టీస్పూన్
ఆవాలు,జీలకర్ర
చెరొక 1/2 టీస్పూన్
కరివేపాకు
5-6 రెబ్బలు
తయారు చేయు విధానం:
మిక్సీ లో
గుల్ల సెనగపప్పు, కొబ్బరి, పచ్చి మిర్చి, ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత తగినంత నీరు పోసి మెత్తగా
గ్రైండ్ చేసుకుని తయారైన పచ్చడిని ఒక బౌల్ లో కి తీసుకుని పోపును వేసుకోవాలి. అంతే!
ఎంత తేలికో చూసారా! కాని రుచి మాత్రం బాగుండాలండోయి!
ఇంకే
దూదుల్లాంటి ఇడ్లీలు, దాని పైన కమ్మని నెయ్యి, నంచుకోవడానికి సెనగ పప్పు, కొబ్బరి చట్నీ చేసేసుకోండి.
ఇంకో విషయం మర్చిపోకండి. మీ ఇంట్లో కారప్పొడి (అంటే వెల్లుల్లి లేదా ధనియాల
కారోప్పొడి, ఆ రెండూ లేకపోతె సెనగ పొడి, కరివేపాకు పొడి) సాధారణంగా చేసుకుని డబ్బాల్లో పదిల పరచుకుని అలమార్లల్లో
అందంగా పెట్టుకుంటారు కదా! అవి కూడా తీసి చట్నీ ప్రక్కనే వేసుకుని కరిగిన నెయ్యి ఆ
పొడి లో వేసుకుని మెత్తని ఇడ్లీని తున్చుకుని ఒక సారి పచ్చడి లో ముంచుకుని, దాన్ని సుతారంగా పొడి లో అద్ది నోట్లో పెట్టుకోండి. తరువాత మీ అనుభూతి
చెప్పండి.
ఇడ్లీ
తిన్నాక వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగటం మర్చిపోకండే!
No comments:
Post a Comment