Friday, January 16, 2015

‘ముల్లంగి ఆకులతో పచ్చడి’



శ్రీమతి రత్నా శ్రీనివాస్

మనము ముల్లంగితో చేసుకునేంత వంటలు ముల్లంగి ఆకులతో చేసుకోవటం కొంచెం అరుదు. ఇవి కొంచెం పాల కూర ఆకులను పోలి వుంటాయి. రుచి ముల్లంగి మాదిరిగానే కొంచెం వగరుగా వుంటుంది. ఐతేనేమి! ఏ ఆకుకూర లోనైనా ఔషధ గుణాలు మెండు. ముల్లంగిఆకులతో కడుపు నెప్పులను, రుమేటిజం, పైల్స్, మూత్రకోశ సంబంధిత మొదలైన వ్యాధులను నివారించడంలో తోడ్పడుతాయి. ముల్లంగి ఆకులతో పచ్చడి చేయటం తెలుసుకుందాం.

వస్తువులు రెడీ చేయుటకు పట్టే సమయం:           5 నిముషములు

వండుటకు పట్టే సమయం:                                15 నిముషములు

కావలసిన వస్తువులు:

  ముల్లంగి ఆకులు:                           ఒక కట్ట
ఎండు మిరపకాయలు                     6
మినప పప్పు                                2 టేబుల్ స్పూన్స్
ఆవాలు                                       1 టీ స్పూన్                                 
ఇంగువ                                       1 టీ స్పూన్
మెంతులు                                     1/4టీ స్పూన్
చింత పండు                                  30 గ్రాములు
నూనె                                          2 1/2 టేబుల్ స్పూన్స్                                  
పసుపు                                        చిటికెడు
బెల్లం                                          1 టేబుల్ స్పూన్
కారం                                          1/4టీ స్పూన్

తయారు చేయు విధానం:

ముల్లంగి ఆకులను మంచి నీటిలో శుబ్బరంగా దులిపి రెండు, మూడు సార్లు కడిగి సన్నగా తరుక్కోవాలి.

ఒక బాణలిలో ½ టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తరువాత ముల్లంగి ఆకులను వేసి వేయించుకోవాలి.

ఇపుడు వేరొక చిన్న పోపు బాండీ ని తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాగిన తరువాత మెంతులు వేసి వేయించుకోవాలి.

తరువాత మినప పప్పు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి.

ఆవాలు వేసి చిటపటలాడేక ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మిరపకాయలు వేగేక ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.

వేగిన పోపులో కొద్దిగా పోపును ఒక కప్పులోకి వేరేగా తీసుకోవాలి. ఒక స్పూన్తో మిగిలిన పోపుకు అడ్డం పెట్టి నూనెను కూడా కప్పులోకి వంచుకోవాలి. ఇపుడు ఆ కప్పులోకి ఒక పావు స్పూన్ కారం పొడి వేసుకోవాలి. నూనె వేడిగానే వుంటుంది కాబట్టి ఆ వేడికి కారం వేగినట్లు అయిపోతుంది.

ఒక కప్పులో చింతపండును నానబెట్టుకోవాలి. నానిన చింతపండును పిసికి, వేగుతున్న ఆకులలో వేసి, చిటికెడు పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఆకులు చింతపండు రసాన్ని బాగా పీల్చుకున్నాక స్టవ్ ఆపేసుకుని వేడి చల్లర్చుకోవాలి.

పోపు చల్లారేక మిక్సీ లో తిప్పుకోవాలి. నలిగిన పోపులో వేగి చల్లారిన ముల్లంగి ఆకులను, తగినంత ఉప్పును, పొడి చేసి పెట్టుకున బెల్లంను  వేసి గ్రైండ్ చేసుకోవాలి.

పచ్చడిని గ్రైండర్ లోంచి తీసి, అంతకు ముందు మనం ఒక చిన్న కప్పులో కొంచెం పోపు, నూనెలో పొడి కారం వేసి పెట్టుకున్నాము కదా అందులో వేసుకుని కారం, పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

వడ్డించుటకు సలహాలు మరియు ఇతరత్రా:

ముల్లంగి పచ్చడి వేడి వేడి అన్నం లోను, చపాతీ, పరాటా,దోశలతోనూ తినవచ్చును.

పైన చెప్పిన పద్దతిలోనే పుదిన కారం, కొతిమీర కారం కూడా తయారు చేసుకోవచ్చు.


 










No comments:

Post a Comment