Saturday, January 10, 2015

సంక్రాంతి వ్యాస పరంపర: ఆఖరి భాగం: సంబరాల సంక్రాంతి


శ్రీమతి నయన కస్తూరి

మొదటి పండుగను భోగి అంటారు. ఈ రోజు ఉదయాన్నే భోగి మంటలు వెసుకుంటారు. ఇక చలికాలం పోయి కొంచెం ఎండలు పెరిగి పగటి సమయం రాత్రి సమయం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతల లోని ఈ మార్పులకు మన శరీరాన్ని మనసును ఆయత్తం చేస్తాయి ఈ భోగి మంటలు. అంతే  కాకుండా ఇంట్లోని పాత సామానునంతా భోగి మంటల లో వేయడం వలన ఇంట్లో పరిశుభ్రత నెలకొంటుంది. ఇరుగు పొరుగు వారంతా కలిసి వేసుకోవడం వలన అందరి  మధ్య స్నేహ సహకారాలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు భోగి నాడు శిరస్సు మీద రేగి పళ్ళు కాని జిల్లేడు ఆకులు కాని వుంచి, తలారా స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరించి, సాయం కాలం పదేళ్ళ లోపు పిల్లలను కూర్చో పెట్టి, గవ్వలు రూపాయి బిళ్ళలు, పూలు కలిపి రేగి పళ్ళను దిష్టి తీసి తల మీద పోసి హారతులిస్తారు. దీనినే  భోగి పళ్ళు పోయడం అంటారు. ఇలా చేయడం వలన బాలారిష్టలు పోయి పిల్లలు ఆరోగ్యం గా ఎదుగుతారని హిందువుల విశ్వాసం . కొన్ని ప్రాంతాల వారు వారి వారి ఆచారాన్ని బట్టి భోగి నాడు  బొమ్మల కొలువును ప్రారంభించి, పేరంటం చేస్తారు. రంగు రంగుల గాలిపటాలు పోటీ పడి  ఎగురవేస్తారు.

రెండవ రోజు సంక్రాంతి పండుగ. ఈ రోజున కూడా కొత్త దుస్తులు ధరించి, పిండి వంటలు చేసుకుని, బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తారు. సూర్యుడు మకర రాశి లో ప్రవేశించి, ఉత్తరార్ధ గోళం లోకి ప్రవేశించడం వలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. చాలా మంది ఇంటి యజమాని చేత గృహం లో సుఖ శాంతుల కై మంచి గుమ్మడి పండును అంటే కూర గుమ్మడి పండును పగుల గొట్టించి, అందరికి పంచుకుంటారు. బొమ్మల కొలువుకు ఉద్వాసన పలుకుతారు. కొన్ని ప్రాంతాల వారు భోగిపళ్ళను సంక్రాంతి నాడు పోస్తారు. కొత్త పంట లోని బియ్యం తో పెసరపప్పు, కొత్త బెల్లం కలిపి, పొంగలి చేసి సూర్య భగవానుడికి నివేదన చేస్తారు. దీని వలన  కొన్ని ప్రాంతాల వారు సంక్రాంతి పండుగ ను  'పొంగల్' అని కూడా అంటారు. ఈ రోజు అరిసెలు కూడా తప్పక తింటే వారి జీవితాలు మధురం గా సాగిపోతాయని కొంతమంది హిందువుల నమ్మకం. ఆడవారు, పిల్లలు అందమైన పట్టు వస్త్రాల రెపరెపలతో ఇల్లంతా నడయాడి, ఇంటికి లక్ష్మీ కళను తెస్తారు. పల్లేటి దిక్కున సంక్రాంతి పండుగ నాడు కోళ్ళ పందాలు కూడా సందడి చేస్తాయి. ఈ రోజే అయ్యప్ప భక్తులు చాల మంది మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల వెళ్తారు.

మూడవ రోజు కనుమ పండుగ. ఇది ఎక్కువగా వ్యవసాయదారులు పశుపక్ష్యాదులను పూజించడానికి చేసుకుంటారు. అంతే  కాకుండా పితృ దేవతలను కూడా శాంతింప జేయడానికి ముఖ్యం గా శాఖాహారులు మినుముతో గారెలు చేసి, నివేదించి, స్వీకరించాలని చాలా మంది నమ్ముతారు. ఈ రోజు ప్రయాణానికి మంచిది కాదని ఇంట్లోనే అందరు కలిసి మెలిసి, చివరి పండుగను జరుపుకుంటారు. 

ఇదివరకు రోజుల్లో నాలుగవ రోజున ముక్కనుమ కూడా జరుపుకునే వారు. ఇప్పటికి కూడా కొంతమంది జరుపుకుంటారు. ఈ రోజు కూడా పితృ దేవతలను స్మరించుకుని, బంధుమిత్రులతో విందు చేస్తారు. తమ క్రింద పనిచేసే వారికి కానుకలిస్తారు. 

ఇలా అన్ని పండుగల్లోకి ఎక్కువ సందడి చేసి, 'పెద్ద పండుగ' అనే నామాన్ని సార్ధకం చేసుకుంది 'సంక్రాంతి' పండుగ. ఈ పండుగ అందరి ఇళ్ళల్లోకి ఎన్నో సంబరాలను వెదజల్లి, మనకు అందాన్ని ఆనందాన్ని అందిస్తుంది. అందుచేతనే 'ఆనందం' కి 'సంక్రాంతి' ప్రత్యామ్నాయ పదం గా కూడా వాడుతుండటం కనిపిస్తుంది మనకు. ఊరంతా ఆనందంగా ఉందనుకోండి 'ఊరంతా సంక్రాంతి' అంటాము. మనకు విందు వినోదం తో పాటు ఎన్నోమంచి  సంగతులను......కుటుంబమంతా కలిసి జరుపుకోవడం, ఇంటి ఆడపడుచులను ఆదరించడం, ఇరుగు పొరుగు వారితో స్నేహసహకారాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు, పరిశుభ్రత, అలంకరణలు, పాటలు, పద్యాలు, నృత్యం లాంటి కళా పోషణ, పశు పక్ష్యాదుల మీద దయాభావము, తమ క్రింద పనిచేసే వారిని ప్రోత్సహించడం, తమకొచ్చిన పంట ఫలాన్ని తోటి వారికి పంచిపెట్టడం .......... లాంటి ఎన్నిటి నో మనలో పెంపొందించే ఈ సంక్రాంతి  పండుగను అందరం కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుందామా మరి? అందరికి సంక్రాంతి శుభాకాంక్షలతో ....... శుభం






No comments:

Post a Comment