Thursday, January 1, 2015

కొత్త సంవత్సరపు తీపి పలుకులు: ‘పలుకు పంచదార చిలుక!’


ముందుమాట:
మనం ఒక సారి మనం చిన్నతనం లో వెళ్ళిన పెళ్ళిళ్ళు గుర్తు తెచ్చుకుంటే, చివరలో అందరి చేతిలో ఒక ప్లాస్టిక్ బాగ్, మరి అందులో తాంబూలం, కర్పూరపు కడ్డీ, ఒక పండు ఉండటమే కాకుండా, తప్పనిసరిగా ఒక పంచదార చిలుక ఉండేది. పిల్లలందరూ, గబ గబా పొట్లం విప్పేది ఈ చిలుకను కైవసం చేసుకుని నోటిలో వేసుకోవటానికే!

మరి ఈ చిలుక ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే, పంచదార చిలుక నోట్లో వేసుకుంటే ఎంత హాయిగా ఉల్లాసంగా ఉంటుందో, కొంతమంది వారి మాటల ద్వారా అవతలవారికి   మనస్సుకి సంతోషం కలిగేలా, ఉత్సాహం పుట్టేలాగా మాట్లాడుతారు. వీరి పలుకులు కూడా పంచదార చిలుకలే మరి. 

పంచదార చిలుకలో మధురం  తప్ప మరొక పదార్ధం ఉండదు. మొదటి నుండి చివరి దాకా అంతటా ఆ తీపితనమే నిండిపోయి ఉంటుంది. అంటే నిష్కల్మష  మైనదన్నమాట.  అంతే కాకుండగా అది తిన్నాక కూడా ఇంకొంచెం సేపు మన నోటిలో ఆ మధురత్వమే నిండి ఉంటుంది. 

ఇంకో అర్ధం తీసుకుంటే, ఎలాగయితే పంచదార చిలుకలో కేవలం పంచదార తప్ప   ఇతర మైన పదార్ధం కలవకుండగా స్వచ్చమైన  తీపిని మాత్రమె అందిస్తుందో, అలాగే ఎవరి మాటలు నిర్మలంగా, ఏ విధమైన కల్మషం, కపటం  లేకుండగా ఉంటాయో అవి కూడా పంచదార చిలుకలే మరి.  అ నూతన సంవత్సర శుభవేళ పంచదార చిలుకల లాంటి పలుకులు చెపుతున్నారు శ్రీమతి పద్మ. ఇక చప్పరించటమే తరువాయి!

రమణ బంధకవి

సంపాదకుడు




‘పలుకు పంచదార చిలుక’


శ్రీమతి పద్మా రఘునాద్


ఇదివరకటి రోజుల్లో  పెళ్ళిళ్ళకి, పేరంటాలకి పంచదార చిలుకలను పంచే వారు. వాటి గురించి తలచుకుంటేనే నోరు వురి పోతుంది. ఎందుకంటే పేరులోనే అంత మధురత్వం ఉంది మరి. పేరంటం నుండి రాంగానే వెంటనే అవి నోటిలో వేసుకోటానికి పోటీలు పడే వాళ్ళము. వేసుకోగానే నిమిషానికి  కరగి పోయేవి. చాల మధురంగా మెత్తగా ఉండేవి. కానీ రాను రాను అవి పంచటం బొత్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. వాటిస్థానం లో లడ్డు లాంటి వేరే తీపి పదార్ధాలు చోటు చేసుకున్నాయి. ఎన్ని రకాల తీపి పదార్ధాలు ఉన్నా పంచ దార చిలుక పంచదార చిలుకే మరి! అంత రుచిగా, మెత్తగా నోట్లో వేసుకోగానే మెల్లగా కరగుతూ, ఆ తీపితనం  నోరంతా కొంచెం సేపు వ్యాపించి లాలాజలం తో కలసి ఊరుతూ తినేటపుడు స్వర్గం గుర్తుకు వచ్చేలాగ అనిపించటం చాలామందికి అనుభవం లోకి వచ్చే ఉంటుంది. అంత బాగుంటుందన్న మాట పంచదార చిలుక అన్నపదమే. 

ఇంటి శుభ కార్యానికి విచ్చేసినవారికి కృతజ్ఞతగా వచ్చిన వారందరిని  నోరు తీపి చేసుకోమని, వారు వచ్చినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకోటానికి ఇవి పంచటం లో ఉన్న అంతరార్ధం గా మనకు తెలుస్తోంది.  ఏదైనా శుభ వార్త విన్నపుడో,  సంతోషం కలిగించే సందర్భం లోనో ఈ నోరు తీపి చేసుకోవటమనేది  ఎప్పటినుండో అలవాటుగా వస్తున్నదే. అంటేమనస్సుకి  చాల సంతోషం కలిగినపుడు నోట్లో తీయగా ఏదో వేసుకోవాలని పిస్తుందన్న మాట. ఇంకా చెప్పాలంటే తీపికీ  సంతోషానికి అంత దగ్గర సంబంధం  ఉన్నట్లేగా మరి. 

అందుకే కాబోలు మన పెద్దవారు ఎవరైనా మధురంగా మాట్లాడితే వారి పలుకులను  పంచదార చిలుకలతో పోలుస్తూ ఉంటారు. ఆ పోలిక ఎందుకొచ్చిందా అని ఇంకొంచెం ఆలోచిస్తే, మధురంగా మాటలాడటం అంటే మంచి అందమైన గొంతుతో మాట్లాడటం కాదని, మాటలాడే మాటలే మధురంగా ఉండాలని అర్ధం చేసుకోవచ్చు. మాటల్లోని మృదుత్వం, ప్రశాంతతలని మనం మధురత్వంగా చెప్పుకోవచ్చు. కొంతమందికి ఏ  విషయమైనా కటువుగా చెప్పే అలవాటు ఉంటుంది. దానివలన  చాలా  సమయాలలో అవతల వారి మనస్సు నొప్పించె విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది.  వారు మంచి విషయం చెప్పినా అది కటువుగా ధ్వనించటం  వలన అవతల వారికి అంత రుచించదు. అవి చేదుగా గా  కూడా అనిపిస్తాయి. వినే వారి మనస్సులోకి ఆ  మాటలు మంచివే అయినా  వెళ్ళక పోయే పరిస్థితి సంభవిస్తుంది. 

అలా  కాకుండగా కొంత మందికి చాలా మృదువుగా, అనునయంగా, మధురంగా మాట్లాడే స్వభావం  ఉంటుంది. వారు కటువైన విషయాన్ని కూడా చాల మధురంగా ఎవరిని నొప్పించకుండగా మాట్లాడటం వలన అవతల వారిని  ఆకట్టుకునే అవకాశం ఉంది. వీరి పలుకులని పంచదార చిలుకలుగా పోల్చుకోవచ్చు. 

మధురంగా మాట్లాడటం అంటే మనస్సుకి ఉల్లాసం కలిగించేలా మాట్లాడటం అని ఇంకో అర్ధం కూడా చెప్పుకోవచ్చు. ఏదయినా  సమస్య గురించి చర్చించుకునేటపుడు, కొంత మంది మాటలవలన ఆ సమస్య ఉన్నదానికన్నా మరింత పెద్దదిగా కనిపించి అవతలవారికి మరింత చింత కలిగేలా అనిపిస్తుంది. అదే సమస్య గురించి ఇంకొంతమంది దాన్ని చిన్నది చేస్తూ, ఎదుటి వారికి ఉరట కలిగేలా మాటలాడటం వలన సమస్య ఉన్నవారికి కొంచెం మనశ్శాంతి గా ఉంటుంది. అపుడు  కూడా మనం వారి పలుకులని పంచదార చిలుకలుగా చెప్పుకోవచ్చు.

మొత్తానికి ఎవరయితే ఇతరుల మనస్సు నొప్పించకుండగా మాట్లాడుతారో,  ఎవరి మాటల్లో మృదుత్వం, ఆప్యాయత, కరుణ ఉంటాయో, ఎవరి మాటలతో వినేవారికి  సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలగ చేస్తాయో అవన్నీ పంచదార చిలుకలే! అవి వింటున్నపుడు పొందే ఉరట, హాయి పంచదార చిలుకను తిన్న అనుభూతే మరి!

నూతన సంవత్సర శుభాకాంక్షలతో!






No comments:

Post a Comment