Monday, January 12, 2015

బొమ్మల కొలువు - బొమ్మల పెళ్లి---- జరుగును ఇంట్లో శుభాలు మళ్ళీ .. మళ్ళీ!


ముందుమాట:
మన హిందూ పండుగల గొప్పతనమేమిటంటే విందులూ వినోదాలే కాకుండా మనకు నిత్యజీవనం లో మిక్కిలి ఉపయోగపడే ఎన్నో సంగతులు నేర్పుతాయి.  ప్రతీ పండుగా ఒక శిక్షణా శిబిరం అని ఒప్పుకోక తప్పదు.  ప్రతీ వేడుక నుండి చిన్నా పెద్దా, మగా ఆడా అనే తారతమ్యం లేకుండా ఎన్నో జీవిత పాటాలు నేర్చుకోవచ్చు మనం మనసు పెట్టాలె కానీ.  ఇది వరలో మనం చూసాము అట్లతద్ది, ఉండ్రాళ్ళతద్ది, పొలాల అమావాస్య ....మొదలైన ఆడపిల్లల పండుగలు ప్రతీ ఆడపిల్లను ఒక మంచి అమ్మలాగా ఒక ఉత్తమ ఇల్లాలు లాగా తీర్చిదిద్దటానికి ఎంతగా ఉపయోగ పడ్డాయో! ఇక ఇప్పుడు దేవీ నవరాత్రులలోనూ రేపటి సంక్రాంతి పండుగ సందర్భం లోనూ ఏర్పాటు చేసే బొమ్మల కొలువు కానీ, బొమ్మల పెళ్లి  లో కానీ  అంతర్లీనం గా వుండే సామాజిక  తత్వాన్ని గురించి శ్రీమతి నయన గారు ఏమి చెపుతున్నారో తెలుసుకుందాము.

రమణ బంధకవి

సంపాదకుడు

‘బొమ్మల కొలువు – బొమ్మల పెళ్లి’

శ్రీమతి నయన కస్తూరి

మన జీవితంలో ఏ పని లోనైనా విజయం సాధించాలంటే దానిని ఒక పధ్ధతి ప్రకారం చేసుకోవాలి. ప్రణాళికను తయారుచేసుకోవాలి. అది ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో చేస్తేనే విజయం వరిస్తుంది. కనుక పద్ధతిని తెలుసుకోవాలి. ఆ పనికి ఎవరి సహకారం అవసరమో వారిని కలుపుకోగలగాలి.  పెద్దల సలహాలు తీసుకొవాలి. ఆచార వ్యవహార జ్ఞానం కలిగి ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి మన పిల్లలిని పెద్ద బిజినెస్ స్కూల్స్ లో బోలెడు ఫీజులు కట్టి జేర్పించాలేమో బాబోయ్ అనుకోకండి. మన పెద్దలు పండితులు ఈ వ్యవహార జ్ఞానాన్ని చాలా మటుకు మన పండుగ  వేడుకల్లో పొందు పరిచారు. పూజలు, పేరంటాలు, అలంకరణ,.......లాంటివి ఎన్నో మన ఆడపిల్లలికి భవిష్యత్ లో ఉపయోగపడే ఎన్నో సూత్రాలను నేర్పుతాయి. అలాంటి వాటిల్లో బొమ్మల కొలువు, బొమ్మల పెళ్లి ముఖ్యమైనవి. ముందుగా ఈ బొమ్మల కొలువు మనకు ఎన్ని పాటాలు నేర్పిస్తుందో చూద్దామా ఇప్పుడు?

ముందుగా మన పెద్దల ఆచారాలు, సంప్రదాయాలు మనం కొనసాగిస్తే దానివలన మనకు ఎంతో  ఆనందం కలుగుతుందని గ్రహిస్తాం. పూర్వపు రోజులతో పోలిస్తే పోటీ ప్రపంచపు  జీవనం లో పడి ఎన్నో మాధుర్యాలను కోల్పోతున్నాం. మానవులకు దేవుడు వరంగా ఒసిగిన అనుభూతులను అన్నీ వదులుకుని, యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాం. మన అదృష్టం కొలది ఇంకా ఇవి పల్లెల్లో అందుబాటులో వున్నాయి. అందుకని ఇప్పటికీ  పల్లెల్లో ఇల్లు వున్న వాళ్ళు కనీసం పండుగ సెలవుల్లో తమ పిల్లలను తప్పక తీసుకుని వెళ్లి ఇలాంటి వేడుకల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయం  కొనసాగేలా చూసుకోవాలి.  

బొమ్మలకొలువు పెట్టడానికి మన దగ్గర వున్న బొమ్మలను బట్టి మెట్ల లాగా బల్లలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి మీద ఒక కొత్త తెల్లని వస్త్రం పరుచుకోవాలి. భోగి రోజు బొమ్మలకొలువు పెడతాము కనుక ముందు రోజు రాత్రి అన్ని శుభ్రపరుచుకుని, ముందుగా గణపతి బొమ్మను పెట్టాలి. తర్వాత ఒక కొత్త బొమ్మ పెట్టుకోవాలి. పిల్లలకు పురాణ గాధలు గుర్తు చేయుటకై  రామాయణ మహాభారతం లోని పాత్రల బొమ్మలు ఎక్కువగా పెడతారు. రకరాకాల బొమ్మల సేకరణ వాళ్ళ ఆలోచనా శక్తికి పదును పెడుతుంది.  సీతారాముల కల్యాణం బొమ్మలు, పట్టాభిషేకం బొమ్మలు, కృష్ణ లీలల బొమ్మలు మొదలైన బొమ్మల ద్వారా పిల్లలకు పురాణాల భోధన జరుగుతుంది, కుటుంబసభ్యుల బొమ్మల ద్వారా కుటుంబం లో అందరూ కలిసి అన్యోన్యంగా ఉండాలని  తెలియజేస్తుంది.  మనకు నిత్యజీవనం లో అవసరమైన పనులు చేసి పెట్టే పురోహితుడు,  రైతు, ఉపాధ్యాయుడు, చాకలి, దర్జీ, వైద్యుడు, కిరాణా కొట్టు కోమటి శెట్టి, శెట్టమ్మ, వడ్రంగి, కంసాలి లాంటి వారి బొమ్మలు పేర్చి, ఒకరి అవసరం  ఒకరు తీర్చి, సహకారజీవనం ఎలా సాగించాలో భోధన జరుగుతుంది. పరిసర పారిశుభ్రత, పొదుపు జీవనం, సహజ వనరుల పరిరక్షణ ....ఇలా ఎన్నో మంచి మంచి సంగతులు బొమ్మల ద్వారా మనకు తెలుస్తాయి. అంతే కాకుండా తమకు వున్న వనరులతో ఏ పనినైనా విజయవంతంగా చేయడానికి ప్రేరణ పొందుతారు. పక్క వారిది కన్నా తమది బాగుండాలనే ఒక ఆరోగ్యకరమైన పోటీ భావం, ప్రేరణ పొందుతారు. 

భోగి ముందు రోజు అన్నీ సిద్దం చేసుకుని, భోగి నాడు ఉదయాన్నే భోగి స్నానాలు తర్వాత బొమ్మల కొలువు ఎవరిచేత పెట్టిస్తున్నారో వారి చేత దేవతలను ఆవాహన, అర్చన చేయించి, దీప ధూప నివేదనలు  హారతులిప్పిస్తారు. సాయంకాలం ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇప్పిస్తారు.  రెండవ రోజు సంక్రాంతి నాడు కూడా పూజ సలిపి, దీప ధూప నివేదనలు సమర్పించి, హారతులిచ్చి, పేరంటం చేసుకుంటారు.  మూడవ రోజు కనుమ నాడు అర్చన చేసి, ఉద్వాసన పలుకుతారు. ఈ అలవాటు వున్నవారు మానకుండా ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెట్టుకోవాలి. 

ఈ విధం గా బొమ్మల కొలువు ద్వారా పిల్లలు ఎన్నో తెలియని సంగతులు తెలుసుకుంటారు. భవిష్యత్ లో వారు నిర్వహించే బాధ్యతలకు పునాదులు పడతాయి. వారు భాద్యతాయుతమైన కుటుంబ సభ్యులుగా, సమాజం లో మంచి నాగరికులుగా రూపొండుతారు.

ఇక బొమ్మల పెళ్లి విషయానికి వద్దాము. ఈ రోజుల్లో ఇవి పూర్తిగా కనుమరుగైపోయానని చెప్పడానికి చాలా బాధగా వుంది. ఇది ఏదో పిల్లలు  సరదాగా ఆడుకునే ఆట మాత్రమె కాదుసుమండీ! ఇది మన పెద్దలు మనకిచ్చిన ఏంతో  అర్ధవంతమైన వినోదం. మన కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, వివాహ బంధం మీదే ఆధారపడి ఉంది. ఇది కేవలం ఒక అబ్బాయికి, అమ్మాయికి సంబందించినది కాదు. రెండు కుటుంబాల కలయిక. అబ్బాయి కుటుంబం లో అందరూ అమ్మాయిని తమ కుటుంబం లో ఒక సభ్యురాలిగా ఆదరించ కలగాలి. అదే విధం గా కొత్తగా వచ్చిన కోడలు అత్తమామలలో తల్లితండ్రులను చూసుకోగలగాలి. ఆడపడుచులను బావమరడులను స్వంత తోబుట్టువులులాగా చూసుకోవాలి. ఈ బొమ్మల పెళ్ళిళ్ళను కూడా అన్ని ఆచారాలను పాటిస్తూ, అందరికీ  తెలియజేస్తూ కొంతమంది మగ పెళ్లివారుగా, కొంతమంది ఆడపెళ్ళి వారుగా వుండి నిజమైన పెళ్ళిళ్ళలో జరిగే తంతులన్నీ జరిపిస్తారు. ఎలాంటి వరుడిని ఎంచుకోవాలో పాటలద్వారా వరుని గుణగణాలు వర్ణిస్తూ తెలియజేస్తారు. అలాగే వధువు ఎలా ఉండాలో ఆమె గుణగణాలు వర్ణిస్తూ పాడతారు. కేవలం అమ్మాయి అందమో, అబ్బాయి ధనమో చూసి ఎంచుకోకుండా వారి తాతగార్ల, తండ్రిగార్ల ప్రవర [అంటే గోత్రనామాలు]చెపుతూ అమ్మాయి గోత్రం, ఇంటిపేరు, వివాహం తర్వాత మారడం అన్నీ చెప్తుంటే పెళ్లి కాబోయే పిల్లందరికి పెళ్లి అంటే ఆషామాషీ వ్యవహారం కాదని రెండు కుటుంబాల కలయిక అని చిన్న చిన్న అపోహలకే విడిపోయే అంత బలహీనమైనది కాదని తెలుసుకుంటారు.  వాళ్ళ వివాహబంధం విజయవంతం చేసుకోవడానికి కృషి చేస్తారు. 

బొమ్మల పెళ్ళిళ్ళ లో పాడుకునే పాటలు 'పెళ్ళివారమండీ ......ఆడ పెళ్ళివారమండీ! మా పాట్లు వినేదెవరండీ .....!' అంటూ ఆడపెళ్ళివారు తమ ఇబ్బందులు చెప్తే, మగ పెళ్ళివారు కూడా ఇదే తరహాలో పాడుతూ పెళ్ళిలో వాళ్లకి జరిగే లోటుపాట్లను ఏకరువు పెడతారు. రెంటినీ తెలుసుకుని తమతమ ఇళ్లలో జరిగే అసలు పెళ్ళిళ్ళలో ఇవి జరగకుండా జాగ్రత్త పడతారు. ఒకరి కష్టాలు ఒకరు గ్రహించి, అవతల వారిని ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటారు.

బొమ్మల పెళ్లి లో కూడా పెళ్లి  భోజనాలు వియ్యాల వారి పాటలు అన్నీ వుండటం  వలన పెళ్లి పద్ధతులన్న్నే అందరికి తెలుస్తాయి. ఇదివరకు రోజుల్లో ప్రతీ ఇంట్లో ప్రతీ ఏడాది బొమ్మల పెళ్లి జరిగేది . కొంతమంది మామూలుగా అబ్బాయి బొమ్మకి, అమ్మాయి బొమ్మకి కాకుండా సీతా రాముల బొమ్మలికి చేసేవారు. కొంతమంది తాటాకు బొమ్మలకి దుస్తులు వేసి, సన్నాయి మేళం తో పెళ్లి చేసి, అందరూ కలిసి పెల్లిభోజనాలు చేసే వారు. ఇక్కడ మీకో సంగతి చెప్పాలండోయ్! ఎవరి గృహం లో నైనా పిల్లల పెళ్లిళ్లకు ఏవో అవరోధాలు ఏర్పడి, ఆలస్యం అవుతుంటే ఇలా బొమ్మల పెళ్లి చేసి ఇంట్లో సన్నాయి మోగిస్తే వెంటనే ఏవైనా దోషాలు వుంటే పోయి, అడ్డంకులన్నీ తొలగి, వివాహాలు సవ్యంగా జరిగి ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయిట! ఈ బొమ్మల పెళ్లి  భోగి పండుగ నాడే కాకుండా ఎప్పడైనా చేసుకోవచ్చు మనలో  నూతన ఉత్సాహం నింపుకోవచ్చు.       
  
మరి పండుగలంటే ఏదో సినిమా చూసేసి, హోటల్లో తినేద్దాం అనుకోకుండా మన పిల్లలో జిజ్ఞాసను పెంచి, వారి భావి జీవితాన్ని తీర్చి దిద్దుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే సూత్రాలను, శిక్షణను అందించే ఈ వేడుకలను మనం కొనసాగించి, మన భావితరానికి కూడా అందిద్దాం. 






No comments:

Post a Comment