Friday, January 9, 2015

సంక్రాంతి వ్యాస పరంపర: రెండవ భాగం: సంబరాల సంక్రాంతి



శ్రీమతి నయన కస్తూరి

సంక్రాంతి పండుగ విందులు వినోదాలే కాకుండా మనలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించి, మనలోని కృష్ణ తత్వాన్ని విష్ణుభక్తి ని మేలుకోలుపుతుంది. ధనుర్మాసం అనగానే ఆండాళ్ విరచిత 'తిరుప్పావై' మన మదిలో పలుకక మానదు. తిరుప్పావై హిందువులకు దివ్యప్రభంధం. ఆళ్వార్లు రచించిన దివ్యప్రభంధం లోని భాగమే 'తిరుప్పావై'. తమిళ భక్తి సాహిత్యం లో ప్రసిద్ధి గాంచింది. విష్ణు భక్తురాలు అయిన గోదాదేవి తన కృష్ణ భక్తిని 30 పాశురాలు లో గానం చేస్తుంది. ఈ పాశురాలను ధనుర్మాస వ్రతంగా నెల రోజులూ పారాయణ చేస్తారు. ఇందులో గోదాదేవి కృష్ణ పూజకై తన చెలికత్తెలను కూడదీసుకుని, క్రిష్ణుని నిద్ర లేపి, రకరకాల పూలతో అర్చించి, ఎంతో భక్తి ప్రేమ పూర్వకంగా తన ప్రేమని తెలియజేసింది. ఇది ప్రతీ హిందువు చదివి ఆనందించవలసిన ఒక  అద్భుత కావ్యం.  ధనుర్మాసం  నెల రొజులూ తిరుప్పావై పారాయణం చేసి ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. 
  
ధనుర్మాసం నెల రోజుల పాటూ ఊర్లోని కన్నె పిల్లలంతా బాపూ బొమ్మల్లా తయారై ఆవు పేడతో ముద్దు ముద్దుగా గొబ్బెమ్మలను తయారు చేసి, బంతి పూలతోను, గుమ్మడి పూలతోనూ అలంకరించి, పసుపు కుంకుమలను అలది, గౌరీ దేవికి మంచి సుఖమయమైన శుభప్రదమైన జీవనం కోసం పూజలు చేసి గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తూ 'గొబ్బీయల్లొ...  గొబ్బీయల్లో...... అంటూ ఎన్నో పాటలు పాడుతూ కలిసిమెలిసి ఆడుతూ, పేరంటాలు జరుపుకుంటూ, ఆనందాలను పంచుకుంటారు. ఈ అందమైన దృశ్యాన్ని ఒక్క సారి కనులముందు నిలుపుకోండి ...... మీ హృదయాలు తన్మయిత్వం  చెందక మానవు. ఇలా నెలరోజుల పాటు చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఎండబెట్టి, మాఘ మాసం లో వచ్చే రధసప్తమి నాడు ఆ పిడకల మీద ఆవు పాలు పొంగించి, అన్నం పరమాన్నం వండి, చిక్కుడాక్కుల్లో సూర్య భగవానుడికి నివేదన చేస్తారు.

ఆడపిల్లల అందమైన గొబ్బెమ్మల పాటలకు తోడుగా గంగిరేద్దుల మేళం ఎంతో సందడిని పెంచుతుంది. గంగిరెద్దులను అందంగా రంగు రంగు వస్త్రాలతో అలంకరించి, ఎన్నో ఆటలు ఆడిస్తారు. గృహస్తులంతా వాటిని తనివితీరా తిలకించి అభిమానం తో గంగి రెద్దులకు ఆహారాన్ని, ఆడించిన వానికి వివిధ రకాలైన కానుకలను ఇచ్చి తృప్తి పరుస్తారు. 

పండుగకు ఇంటికొచ్చిన ఆడపడుచులను, అల్లుళ్ళను అభిమానం గా ఆదరించి, అరిసెలు, గారెలు లడ్డూలు లాంటి అనేక రకములైన పిండివంటలతో పాటు, ప్రత్యెక వంటలు చేసి, మనసారా వడ్డించి, కొత్త వస్త్రములను ఇచ్చి ఆనందింప చేసి, తమ కుమార్తెల కళ్ళల్లోని ఆనందపు వెలుగులతో తమ గృహాలను నింపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు నువ్వులు, వేరుసెనగ పప్పు, బెల్లం తో కలిపి చేసిన ఉండలను తమ ఆప్తులకు, మిత్రులకు పంచి పెడతారు. దీని వలన పలుకులు మధురం అవుతాయి అని నమ్ముతారు.

దక్షిణాదిన సంక్రాంతి పండుగను ముఖ్యం గా మూడు  రోజులు జరుపుకుంటారు. సాధారణం గా ఇవి ప్రతి సంవత్సరం జనవరి  13,14,15 తేదీలలో కాని, 14,15,16 తేదీలలో కానీ వస్తాయి. ఈ సారి 14,15,16 తేదీలలో జరుపుకుంటారు. (సశేషం)









No comments:

Post a Comment