శ్రీమతి రత్నా శ్రీనివాస్
ఈ కూరగాయని చౌ చౌ ఆని లేదా స్క్వాష్ అని
కూడా పిలుస్తారు. ఇది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో విరివిగా దొరుకుతుంది. మన
ప్రాంతాలలో కూడా దొరుకుతుంది. దీని ధర చౌకగానే ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు మెండు.
ఇది రుచిలో ఆనపకాయను పోలి ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని
టమాటో తో కలిపి చక్కటి రుచికరమైన పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
కావలసిన వస్తువులు :
బెంగుళూరు వంకాయ
1
టమాటాలు
5
ఉప్పు
రుచికి సరిపడ
పసుపు
చిటికెడు
ఎండుమిర్చి
4
పచ్చి మిర్చి
2
మినప పప్పు
2 టేబుల్
స్పూన్స్
ఆవాలు
1/4 టీస్పూన్
ఇంగువ
10 గ్రాములు
నూనె
2 టేబుల్ స్పూన్స్
కొతిమీర
కొంచెం
తయారు చేయు విధానం:
మొదట బెంగుళూరు వంకాయను బాగా కడిగి చెక్కు తీసుకొని
చిన్న చిన్న ముక్కలుగ తరుక్కోవాలి.
ఒక బాండీ తీసుకుని అందులో 1 టేబుల్స్ స్పూన్ నూనె వేసి వేడి
చేసుకోవాలి. తరువాత తరిగిన బెంగుళూర్ వంకాయ ముక్కలు బాండీ లో వేసుకొవాలి. తగినంత
ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలియబెట్టుకొని మూత పెట్టి స్టవ్
సిమ్ లో పెట్టుకోవాలి. ముక్కలు వేగేలోగా టమాటాలు తరుక్కుని పెట్టుకోవాలి.
స్టవ్ మీద ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి.
ముక్క మెత్తగా కానక్కర్లేదు. వేగితే చాలు. కొంచెం వేగిందని అనిపించాక తరిగిన టమాటా
ముక్కలు వేయాలి. దానితో పాటు 2 పచ్చి మిర్చి కూడా మధ్యకి తుంపి వేయాలి. మొదట బెంగుళూరు వంకాయ ముక్కలకి
సరిపడా ఉప్పు వేసేము. టమాటాలు కూడా దానికి జత చేసేము కాబట్టి టమాటాలకి సరిపడా మరల
కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇపుడు మూత బెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి. కొంచెం
సేపటికి టమాటాలు మెత్తగా వుడికిపోతాయి. ఇపుడు మంట పెద్దది చేసి టొమాటల తడి ఇగిరి
పోయేటట్లు చేసుకోవాలి. బాండి ని స్టవ్ మీద నుండి దింపి ముక్కలు చల్లారే వరకు ఆగాలి.
స్టవ్ మీద వేరొక చిన్న బాండి పోపుకి పెట్టుకోవాలి. ఒక
టేబుల్ స్పూన్ నూన్ వేసి కాగేక మినప పప్పు వేసి రంగు మారేంతవరకు వేయించుకోవాలి.
ఆవాలు, ఎండుమిర్చి
వేసుకుని చిటపట లాడేక ఇంగువ, కరివేపాకు రెబ్బలు వెసుకొవాలి.
పోపు చల్లరేక మిక్సీ లో తిప్పుకోవాలి. ఈ పాటికి
ముక్కలు కూడా చల్లరిపోతాయి కాబట్టి అవి కూడా వేసి, కొతిమీర కూడా జత చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్
చేసుకున్న పచ్చడిని ఒక బౌల్ కాని చిన్న గిన్నెలోకి కాని తీసుకోండి.
ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనే కాకుండా ఇడ్లి, దోశ, ఉప్మాలో
కూడా చాల బాగుంటుంది . పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2, 3
రోజులు నిల్వ కూడా వుంటుంది. టమాటాల బదులు చింత పండు కూడా మీరు
వేసుకోవచ్చును. ఐతే టమాటాల వలన ఎర్రటి రంగు వచ్చి అందంగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment