Thursday, January 1, 2015

వైకుంఠ ఏకాదశి- ఉత్తర ద్వార దర్శనం - నూతన సంవత్సరం



శ్రీమతి నయన కస్తూరి


ఎన్నో జయాలు, విజయాలు చవి చూసి 2014 ముగించుకుని, 2015 లోకి ఆనందంగా అడుగిడబోతున్న శుభ సందర్భంలో తెలుగు భోజనం అభిమానులందరికీ హార్దిక అభినందనలు అందజేస్తూ ఈ సారి నూతన సంవత్సరం ఒక విశేషమైన రోజుతో మొదలు అవుతోందనే విషయాన్ని మీ చెవిన వేస్తున్నా.

2015 సంవత్సరం పుష్యమాసం, ధనుర్మాసం కలిసిన శుక్ల ఏకాదశి తో  ఆరంభమవుతోంది. ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటో మీకు తెలుసా? అదేనండి ఈ సారి నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి లేక ‘ముక్కోటి ఏకాదశి’ అనే పవిత్రమైన రోజు తో ప్రారంభం కావడం ఒక శుభసూచకం అనక తప్పదు. మరి వైకుంఠ ఏకాదశి విశిష్టత అలాంటిది. ప్రతి హిందువుకి ఈ రోజు యొక్క ప్రాధాన్యత అంతో ఇంతో తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు కొంచెం వివరం గా చెప్తాను.

హిందువుల ప్రగాఢమైన నమ్మకం ఏమిటంటే ఈ వైకుంఠ ఎకాదశి  నాడు శ్రీ మహా విష్ణువు నివాసమైన  వైకుంఠ ద్వారం భక్తుల కొరకు తెరిచి ఉంటుందని, ఆ రోజు చేసే ఏ ఆధ్యాత్మిక సేవ అయినా కోట్ల రేట్లు పుణ్యం సంపాదించి పెడుతుందని! అందుచేతనే వైష్ణవాలయాలలో విశిష్ట పూజలు, ప్రార్ధనలు, పారాయణాలు హోమాలు ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత వుంది ఈ రోజున ఉపవాసాన్ని  ఆచరిస్తే సంవత్సరం లోని మిగతా 23 ఏకాదశుల రోజులలో కూడా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుతుందిట. దైవం కూడా మనకు చాలా ప్రత్యామ్నాయాలు ఇస్తూ ఉంటాడు. కాకపొతే అవి మనం పట్టుకోగలగాలి అంతే! విష్ణుమూర్తి స్వరూపాన్ని ఈ ఏకాదశి రోజున బ్రాహ్మి ముహూర్తం లో ఉత్తర ద్వారం గుండా దర్శించుకోగలిగితే జన్మ ధన్యమైనట్టే! వైకుంఠ ప్రవేశానికి టికెట్ దొరికినట్టే! భక్తులందరికీ ఈ సువర్ణావకాశాన్ని కలిగిగించడానికి అన్ని వైష్ణవాలయాల్లోను ఉత్తర ద్వార దర్శనం ఎంతో భక్తి శ్రద్దలతో ఏర్పాటు చేస్తారు. దేవుడి పల్లకి క్రింద నుండి మూడు సార్లు వెళ్లి మోక్షార్హత సంపాదించుకుంటారు.    

అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఎలా ప్రాధాన్యత పొందిందో ఆ రోజు ఏమి జరిగిందో పద్మ పురాణం లో పేర్కొనబడిన సంగతులను క్లుప్తంగా వివరిస్తాను. పూర్వం మురన్ అనే రక్కసుని బాధలు పడలేక దేవతలు విష్ణువుని వేడుకోగా ఆయన ఆ రక్కసునితో పోరాడి మధ్యలో సేద తీర్చుకోనుచుండగా మురన్ విష్ణు భగవానుని అంతమొందించ చూడగా విష్ణు మూర్తి నుండి ఒక స్త్రీ శక్తి ఆవిర్భవించి, రక్కసుని అంతమొందించినది. ఈ దుష్టశిక్షణ జరిగినది ఈ పుష్యమాసం లో సూర్యుడు ధనుస్సు రాశి లో ప్రవేశించ బోతున్న సమయంలో వుండే ఏకాదశి ఘడియలు వుండే పవిత్రమైన రోజు!   శ్రీ మహావిష్ణువు మేల్కొని సంతసించి ఆ శక్తి స్వరూపిణి కి ఏకాదశి అని పేరిడి, ఈ రోజున పూజలు సలిపే వారికి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయనే వరాన్ని భక్తులకు ఒసగినాడు. ఈ విధంగా ఈ ఏకాదశి రోజును వైకుంఠ ఏకాదశి గా ప్రసిద్ధి చెందింది.
నూతన  సంవత్సరం లోని మొదటి రోజు వైకుంఠ ఏకాదశి కావడం ఎంతో శుభప్రదం. ఈ సంవత్సరం మనకు వైకుంఠ సౌఖ్యాలు కలుగ జేయగలదు. మనం చేయబోయే ఎన్నో సుకర్మలకు దారి చూపుతుంది. ఈ పర్వ దినాన్ని’ముక్కోటి ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ ఏకాదశి పర్వదినాన్న ఉపవాసం ఉంటె, ముక్కోటి ఏకాదశిలకు ఉపవాసం ఉన్న ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.


ఈ సందర్భం లో మనం ఒక సంగతి గ్రహించాలి. మురన్అనే రక్కసుడు మనలోని దుష్ట భావనలకి ప్రతిరూపం! మనం వీటిని నిగ్రహించుకోగలిగితే వైకుంఠద్వారాలు తెరుచుకుంటాయి. అలౌకిక ఆనందం పొందగలుగుతాం. స్వర్గమయ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని రూపొందించు కోగలుగుతాం! నూతన సంవత్సరం పవిత్రమైన  వైకుంఠ ఏకాదశి తో ప్రారంభం కావడంతో మనలోని ఆధ్యాత్మికతను పెంపొందించి ఏడాది పొడుగునా మనలను మంచి మార్గం లో నడిపించి మన జీవితాలను మన పొరుగు వారి జీవితాలను సుఖమయం మరియు స్వర్గమయం చేసుకుందాం మరి!

అందరికి వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో................   
       


No comments:

Post a Comment