Saturday, February 14, 2015

చెమ్మ చిక్కుడు పులుసు-బెల్లం కూర


శ్రీమతి రత్నా శ్రీనివాస్

మనలో కొందరు ఈ చెమ్మ చిక్కుడుకాయలను అప్పుడో ఎప్పుడో చూసే వుంటారు. ఇది మన చిన్నతనం లో విరివిగా దొరికేది. ఈ రోజులలో అక్కడో ఇక్కడో కనబడుతూ ఉండవచ్చు. ఇది చిక్కుడు కాయను పోలి వుంటుంది. కాని సైజులో చాల పెద్దగా ఉంటుంది. దీనితో మనం చిక్కుడు కాయతో చేసుకునే అన్ని వంటలు దాదాపుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనితో పులుసు బెల్లం కూర ఎలా వండాలో చూద్దాము.

కావలసిన పదార్దములు:
చెమ్మ చిక్కుడు                       250gms 
చింత పండు                            నిమ్మ పండు సైజు 
బెల్లం                                     చిన్న ముక్క 
ఉప్పు                                    తగినంత 
పసుపు                                  చిటికెడు 
బియ్యప్పిండి                           1 టీస్పూన్ 
 కారం                                    1/2 టీస్పూన్ 

పోపుకు కావలసినవి :
 నూనె                                    1 టేబుల్ స్పూన్ 
ఎండు మిర్చి                            2
మినప పప్పు                          1టీస్పూన్ 
ఆవాలు,జీల కర్ర                       చెరొక 1/2 టీస్పూన్ 
ఇంగువ                                   సువాసనకు 
కరివేపాకు                              4-5 రెబ్బలు 

తయారు చేయు విధానం :
చెమ్మ చిక్కుడు ను శుబ్రంగా కడిగి సన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరిగిన ముక్కలను గిన్నె లో కి తీసుకుని  తగినంత నీరు పోసి పసుపు వేసి ప్రెజర్ పాన్ లో పెట్టాలి. ఒక విజిల్ రాగానే తగ్గించుకుని 5 నిమిషాలు అలాగే చిన్న మంట మీద వుంచి పెద్దది చేసి రెండవ విజిల్ కి ఆపుకోవాలి. ఒక కప్పులో చింత పండు నానబెట్టుకోవాలి.  

ఈ లోగా ఒక బాండీ  తీసుకుని స్టవ్ పైన పెట్టి వేడేక్కేక పైన చెప్పిన పోపు వేసుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ వచ్చేక ముక్కలు వున్న గిన్నెను బైటకి తీసి ఎక్కువైన నీరు ఒక కప్పులోకి తీసేసి ముక్కలను పోపు లో వేసి కలియ బెట్టి ఉప్పు, పసుపు వేసి, చింతపండు రసం, బెల్లం వేసి బాగా కలిసేలాగా కలియబెట్టి మంట చిన్నది చేసి మూత పెట్టి ఒక 5 నిమషాలు వుంచుకోవాలి. ఇప్పుడు ముక్కలు పోపును, చింత పండు, బెల్లం ని బాగా పీల్చుకున్నాక బియ్యప్పిండి, కారం వేసి ముక్కలకి అంటే లాగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు వుంచి ఆపేసుకుని వేరొక పాత్రలోకి మార్చుకోండి.

ఈ కూర అన్నం లోకే ఎక్కువగా బాగుంటుంది. చపాతీల లోకి కూడా నంచుకోవచ్చును.



No comments:

Post a Comment