శ్రీమతి రత్నాశ్రీనివాస్
(జరిగిన కధ విశ్వం భోజనానికి ఉపక్రమించటం చూసి
వారించేడు. విశ్వం మంత్రం అయ్యేంతవరకు అసహనంగా ఆగేడు. మంత్రం పూర్తయ్యింది. మామగారు
ఔపోసన పట్టేరు. అందరు కలుపుకోవటం మొదలు పెట్టేరు.)
పట్టాభికి
నచ్చిన పదార్ధం ఒక్కటీ లేదు. ఏడుపు దిగమింగుకుంటూ తండ్రి చెవిలో “నాకిది వద్దు. సబ్వే
శాండ్విచ్ కాని బర్గర్ కాని కావాలి” అన్నాడు. “ఇక్కడ అవన్నీ దొరకవురా! ఇదే తినాలి”
నచ్చ చెప్పినట్లుగా అన్నాడు.
“నీకు బంగాళదుంప కూర ఇష్టం కదా!” అని కామాక్షి కూర
కలిపింది. కూరలో అల్లం, పచ్చిమిర్చి దంచి కొట్టేరు. అచ్చగా విశ్వానికి తగ్గట్లే
చేసేరు. అల్లం, పచ్చిమిర్చి అంటే విశ్వానికి కళ్ళలోంచి నీళ్ళు, రెండు చెవుల్లోంచి
పొగలు రావాల్సిందే! నాలిక వగర్చాల్సిందే! అప్పుడే అల్లం, పచ్చిమిర్చికి
అర్ధం-పరమార్ధం అంటాడు. పట్టాభి అంత కారం తినలేకపోయేడు. వగర్చుకుంటూ అది కూడా
విశ్వమే తిన్నాడు. పోనీ పప్పు కలుపుదామంటే అది కూరను మించిన కారం. చక్కగా ఎండు
మిరపకాయ పోపు నలిపి వేసేరు. విశ్వం ఆనందానికి అవధులు లేవు. తల్లితో “ఒక దాన్ని
మించి ఒకటి ఉన్నాయమ్మ!” అన్నాడు.
“అవునుమరే! పచ్చడి కలుపుకోబోతు ఇదేం పచ్చడే?” అడిగేరు కామాక్షిని.
నాలిక్కి రాసుకుని బీరకాయ పచ్చడిలాగా వుందత్తయ్య! అంది. విశ్వం తిని బీరకాయలాగానే
వుంది అన్నాడు. పచ్చడి చాల రుచిగా వుంది. అతనికి విపరీతంగా నచ్చేసింది. మారు
వేయించుకున్నాడు. తను వేయిన్చుకోవడమే కాకుండా తల్లికి కూడా వేయించేడు. పుల్ల
పుల్లగా, కారం కారం గా బాగుందే అన్నారు. పచ్చడిని తెగ మెచ్చుకోవడం చూసి వడ్డించే
ఆవిడ పచ్చడి గుత్తితో వచ్చి మరింత వేసింది. ముద్ద ముద్దకి విశ్వం పొగుడుతూనే
వున్నాడు. విశ్వం మెచ్చుకోవడం చూసి మామగారు కూడా మారు వేయించుకున్నారు. ఆయనకి
ఇష్టమైన మిరియాల చారు కప్పులో పోయించుకుని 2, 3 కప్పులు గటగట తాగేసేరు. మజ్జిగ
నీళ్ళగా వున్నా ఉప్పు వేయడంతో రుచిగా వుంది. మొత్తానికి అందరు సంతృప్తిగా తిన్నారు.
మెతుకు కొరకంది పాపం పట్టాభే! బైట ఏమైనా తిందువుగానిలే
నాన్నా! అంది కామాక్షి. ఇన్నేళ్లల్లో ఇంత మంచి భోజనం మనింట్లో కూడా తినలేదు
అన్నాడు విశ్వం.
కామాక్షి, అత్తగారు చేతులు కడుక్కోవటానికి వెళ్ళేరు. విశ్వం
పచ్చడి స్మృతుల్లోంచి బైటకి రాలేకపోతున్నాడు. ఉండబట్టలేక పచ్చడి వడ్డించిన ఆవిడని
బీరకాయ పచ్చడి బావుందని, ఎలా చేసేరని అడిగేడు. ఆవిడ అది బీరకాయ పచ్చడి కాదని, దొండకాయ
పచ్చడని చెప్పింది. చేతులు కడుక్కుని వస్తున్న సూరిడమ్మ గారితో “అమ్మా! కామాక్షి
బీరకాయ పచ్చడని చెప్పింది కదా! అది దొండకాయ పచ్చడిట” ఎదో పెద్ద రహస్యం ఛేదించిన వాడిలా
గట్టిగా చెప్పేడు. అత్తగారి మోహంలో నెత్తురు చుక్క లేదు. నీళ్ళు తాగుతున్న
మావగారికి పోలక మారింది. కామాక్షి హుష్! అని విశ్వాన్ని వారించింది. విశ్వం తనకేమీ
పట్టనట్లు చెప్పుకుపోతున్నాడు. “దొండకాయ పచ్చడి ఇంత బావుంటుందని నాకు తెలియదు. మనింట్లో
అసలు ఆ ప్రయత్నం కూడా చేయరు”. మావగారు “అయ్యో! దొండకాయ పచ్చడా! మనం కాశీ లో విడిచి
పెట్టామే! అన్నారు.
అత్తగారు వెంటనే తేరుకుని “ఆ .......విడిచి పెట్టి
పదేళ్ళు దాటితే తినినా తప్పులేదుట!” కొత్త సత్యం చెప్పేరు.
“నీ కెవరు చెప్పేరు?” అనుమానంగా అడిగేరు మావగారు .
“మా పంకజం పిన్ని చెప్పింది లెండి” ఏ మాత్రం
తడుముకోకుండా అన్నారు.
జరగకూడనిది ఎదో
జరిగిందని అప్పుడుగాని విశ్వానికి తెలిసిరాలేదు. ఒక్కసారిగా భోజన పారవశ్యం
నుండి బైట పడి నాలిక కరచుకుని ఆటో పిలుచుకోస్తానమ్మ రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుందురురు
గాని అని తప్పించుకున్నాడు.
అత్తగారు దొండకాయ పచ్చడని తెలిసినప్పటినుండి కొంచెం
అన్యమనస్కంగా వున్నారు. విశ్వం ఆటో తీసుకొచ్చాడు. ఆటో ఎక్కుతూ కామాక్షితో
“నువ్వురుచి చూసి బీరకాయ పచ్చడి అన్నావు
కదే!” అన్నారు.
“నాకు తెలియలేదత్తయ్యా” కామాక్షి నొచ్చుకుంది. “అయినా ఈ విశ్వం ఒకడు; వాడు
తిన్నాడు సరే! నాకు కూడా మారు వడ్డించాడాయే!”
“మీ పంకజం పిన్ని తినచ్చు అందన్నావు కదమ్మా! పోనీ
ఆవిడకి ఫోన్ చేసి కనుక్కోరాదూ?” ముందు సీట్లో డ్రైవర్ ప్రక్కన కూర్చున్న విశ్వం
వెనక్కి తిరిగి తల్లితో అన్నాడు.
అత్తగారికి అరికాలి మంట నెత్తికెక్కింది. “ఎప్పటి పంకజం
పిన్నిరా? నా పెళ్ళికి ముందే పోతేనూ! ఒక వేళ బ్రతికి వున్నా నేనామాట చచ్చినా అడగను”
కోపంగా అని కామాక్షి కేసి తిరిగి “వీడిని ఏమనుకోవాలే? అమాయకుడో, వెర్రివాడో
తెలియటంలేదు!” నిట్టూరుస్తూ అన్నారు.
ఆ సమయానికి పంకజం పిన్ని ఆపద్ధర్మంగా వచ్చిందని
కామాక్షి, మావగారు గ్రహించగలిగేరు కాని విశ్వం ఆ సత్యాన్ని గ్రహించుకోలేకపోయేడు.
ఆటో అబ్బాయి కలాం స్ట్రీట్ లో షాపింగ్ కి బాగుంటుందని
ఆపేడు. కామాక్షి మావగారికి స్పటిక లింగం, అభిషేకం
చేసుకోవటానికి రాగి చెంబు, అత్తగారికి హ్యాండ్ బాగ్ కొంది. విశ్వం శంఖం కొన్నాడు. మావగారు
పట్టుకి బాల్ కొనిపెట్టేరు.
ఆ రోజు రాత్రి చెన్నై బండి ఎక్కి మరుసటి రోజు ఉదయమే
అమ్మలు ఇంటికి జేరేరు. అమ్మలు దర్శనం ఎలా జరిగిందని అడిగింది.
అత్తగారు ఆ..... “దర్శనానికే ! బ్రహ్మాండంగా అయ్యింది.
కాశీ లో విడిచి పెట్టిన దొండకాయని రామేశ్వరంవెళ్లి మరీ తిని వచ్చామే అమ్మా!” అత్తగారు
ఎంత మర్చిపోదామనుకున్నా ఆ ఒక్క గునుపు ఆవిడలో
మిగిలిపోయింది.
(శుభం!)
No comments:
Post a Comment