Wednesday, February 18, 2015

....రావయ్యా శివయ్య ..

మహాశివరాత్రి పర్వదినాన్న ఆ సదాశివుని భక్తితో, ఆర్తితో ప్రార్ధిస్తూ మనసు పలికిన నాలుగు మాటలను మీ ముందు ఉంచుతున్నాను.

రమణ బంధకవి

....రావయ్యా శివయ్య ..

రమణ బంధకవి

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

పట్టు బట్ట నేత గానికి ... అయ్యో పాపం ..కట్టు బట్ట కరువాయే..
బరువు మగ్గాల బతుకు సీకటిలో..ఉసురులెన్నో వెలసిపోయే..
పులి తోలు గట్టె వానికి..అబ్బా గుండె యెంత కరుకాయనే ..
చంద్రవంకకు జెప్పి ఇసుమంత ..వెండి వెన్నెల గురిపించవె?

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

హలం బట్టి పొద్దంతా...పొలం దున్నగా  రైతన్న ..
ముప్పొద్దు బొంచేయ్యగా ...పట్టేడంత  మెతుకు గూడ కరువాయేనే!
కలకంటి కన్నీటి గంగ పొంగి .. పెను వరదై ఆశలన్ని ముంచేసినే
తల పైని  గంగమ్మకు జెప్పరాదా? కరుణించి  భూదేవిని తడపేనే !

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

పండు ఫలాల ధరల జూసి  బాబోయి గుండె ఎంతో బరువాయె
కాయగూరలు, పాలు పెరుగులు, మందుమాకులు...అవి ఇవి గావే
ధరల బలురక్కసి గోరల జిక్కి ... బడుగు జీవి  నలిగి పోయే 
'బసవన్నను' ఉరికించి, డమరుకం మోగించి గాయంగా రావే!

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

శివ రాత్రి పర్వ దినాన మనసు పెట్టి కోరుదునయ్య
నీ ధ్యానం వీడి, నీ మౌనం వదలి యిక మా వంక జూడవయ్య
ప్రమద గణాలను బంపి...బలు  చీకట్లను దోలవయ్య
అనంద తాండవ మాడి... ఇల  బ్రతుకులను బ్రోవవయ్యా

ఇది  అంతా  గత్తర ...ఇది ఎంతో గత్తర .. మా వల్ల కాదయ్యా ..
దయచేసి కావంగ, కరుణతో బ్రోవంగ ...రావయ్యా శివయ్యా..

No comments:

Post a Comment