Tuesday, February 3, 2015

రామేశ్వరం యాత్ర – బియ్యపు పిండి రొట్టె – ఆవకాయ బద్ద! మూడవ భాగం


శ్రీమతి రత్నాశ్రీనివాస్
  
కామాక్షి ఈ లోగా ప్రయాణం లోకి మంచి నీళ్ళు, ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు సర్దింది. ఒక డబ్బాలో రొట్టేలో నంచుకోవడానికి ఆవకాయ కూడా పెట్టింది. పట్టాభికి కావలసిన బిస్కెట్లు, జ్యూస్లు, చిప్స్ పెట్టింది. ఈ లోగా రొట్టె వుడికిందేమో చూద్దామని అట్లకాడ తో రొట్టె అడుగు భాగాన్ని జాగ్రతగా లేపింది. కింద భాగం చక్కగా చెక్కుగట్టి అట్లకాడతో సహా లేచింది. విశ్వనాధాన్ని పిలిచి అట్లకాడతో ఒడుపుగా పట్టుకుని రొట్టెని తిరగ వేయమని తను గుడ్డతో మూకుడుని కదిలి పోకుండా పట్టుకుంది. విశ్వనాథం రొట్టిని బాగానే ఒడుపుగా  తిరగవేసాడు. రొట్టె ఎర్రగా కాలింది. సెనగపప్పు సన్న సెగన ఉడికి  కమ్మటి వాసన వస్తోంది. విశ్వనాథం కొంచెం నూనె పోయమన్నాడు. ఇప్పటికే అత్తగారు చాల నూనె పోశారని ఇంక పోయనంది.

ఈలోగా ఫోన్ మోగింది. అమ్మలు చేసింది బయలుదేరుతున్నారా లేదానని. సర్దుకోవటాలు అప్పుడే అయ్యేయని, వడియాలు, చల్ల మిరపకాయలు, పచ్చళ్ళు, అమ్మలు కూతురికి స్వీట్లు పట్టుకొస్తున్నామని, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పమంది. కామాక్షి ఫోనులో మాట్లాడుతుండగా విశ్వనాథం వంటిట్లోకి వెళ్లి బాండీ లో కొంచెం నూనె పోసి వచ్చేడు.

అమ్మలు ఏమి అవసరం లేదని ఎక్కువ బరువులు చేసుకోవద్దని చెప్పింది. వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నానని, రామేశ్వరం నుండి తిరుగు ప్రయాణం లో తన వద్ద రెండు రోజులు గడపాలని, విశ్వాన్ని, పని వుందని పరిగెత్తుకు పోవద్దని చెప్పేనని చెప్పి ఫోన్ సంభాషణ ముగించింది.
కామాక్షి రొట్టె సంగతి చూడటానికి వెళ్ళింది. అట్లకాడతో రొట్టె మధ్యలో గుచ్చి పైకి లేపింది. కాడకి పిండేమి అతుక్కోకుండగా కాడ సునాయాసంగానే బైటకి వచ్చేసింది. కాడతో అడుగు భాగం లేపింది. ఎర్రగా కాలింది. విశ్వనాథన్ని రొట్టెని బైటకి తీయమంది. విశ్వం పళ్ళెం లోకి తీసి ఆరబెట్టి చల్లారేక ముక్కలుగా కోసేడు. రొట్టె నోరూరెలా వుంది. కామాక్షి డబ్బా తెచ్చింది రొట్టె ముక్కలు సర్దడానికి.
విశ్వానికి వేడి వేడి ముక్క ఒకటి అల్లం పచ్చడితో తినాలనిపించింది. “ఎలా వచ్చిందో! నేనొక రొట్టె ముక్క రుచి చూడనేమిటి?” అన్నాడు.
“మరి చెయ్యద్దన్నారు”? కామాక్షి ప్రశ్నించింది. 
“ఎలాగు మీరు చేసారుగా! ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. నువ్వు ఎపుడు చేయవుగా! పోనిలే ! రేపు నా వాట ఈ పూటే తింటాను” అన్నాడు.
“పర్వాలేదు! రేపు తింటానన్నా వద్దనేది ఎవరు?” అని రొట్టె ముక్క ప్లేట్ లో పెట్టి అల్లం పచ్చడి వేసి ఇచ్చింది. విశ్వం రొట్టె మెత్తగా ఉడికి చాల రుచిగా వుందన్నాడు.

అందరూ పెందరాళే లేచేరు. లేస్తూనే అత్తగారు అడిగేరు రొట్టె సంగతి ఏమైందని.
“మీ అబ్బాయి రుచి చూసి మరీ బాగుందని చేప్పేరు అత్తయ్య!” అంది కామాక్షి.
“హారినీ! నేను చెప్పలేదుటే వాడి సంగతి!” వేళాకోళం చేసేరు విశ్వాన్ని.
ఇంట్లో కాఫీలు తాగి కార్లో చెన్నై కి బయలుదేరేరు. తొమ్మిది గంటల వేళ ఒక మంచి చోట కారాపితే రొట్టె తిని మందులు వేసుకుంటామన్నారు అత్త మామలు. విశ్వనాథం దారి ప్రక్కగా ఒక చెట్టు కింద కారాపేడు. పట్టాభి రొట్టె తిననని mcdonalds లోనే తింటానని పట్టుబట్టేడు. కామాక్షి రొట్టె ఎర్రగా కాలిన భాగం పెచ్చు తీసి పట్టాభికిచ్చి రుచి చూడమంది. పట్టాభి రుచి చూసి పెచ్చు క్రిస్పీగా ఉందన్నాడు.
కామాక్షి, ముగ్గురికి ప్లాస్టిక్ ప్లేట్లల్లో పెట్టి ఆవకాయ వేసి ఇచ్చింది. పట్టాభి ఇంకో పెచ్చు కావాలన్నాడు. కామాక్షికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు తను కూడా అంతే! పెచ్చు భాగం తిని పిండి భాగం తల్లికిచ్చేసేది. తన ముక్కలో చెక్కు భాగం తీసి పట్టాభికి ఇవ్వబోతుంటే మావగారు తనకి పళ్ళకి ఇబ్బందని తనదాంట్లోంచి పెచ్చు భాగం తీసి పట్టాభికిచ్చేరు. అందరు రొట్టె బాగుందని తృప్తిగా తిన్నారు.
“కొంచెం వేడి కాఫీ చుక్క గొంతులో పోసుకుంటే అమ్మలు ఇంటికి వెళ్ళేంతవరకు మరి మాట్లాడక్కర్లేదు” అన్నారు అత్తగారు.
కామాక్షి అందరికి ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసుల్లో పోసి ఇచ్చింది. కాఫీ తాగి పెద్దవాళ్ళు మందులు వేసుకున్నాక తిరిగి చెన్నైకి ప్రయాణం కొనసాగించారు. (సశేషం)




No comments:

Post a Comment