Saturday, February 7, 2015

కోతికి కొబ్బరి ఛిప్ప దొరికితే!


ముందుమాట:

జీవ పరిణామ సిద్దాంత ప్రకారం మనిషి కోతి నుండి పుట్టేడన్న శాస్త్రం పక్కన పెడితే, పూర్వ జన్మ వాసనలు ఇంకా వదలనట్టు, కోతి చేష్టలతో పెద్ద బిన్నం గా లేని మానవ ప్రవర్తనలను మనం ఇంటా, బయట రోజూ చూస్తూనే వుంటాము.  అలాగే కొబ్బరి చిప్ప దొరికిన కోతి ఎంత ఆనందంగా దాన్ని భుజిస్తుందో, గుళ్ళో శఠగోపం పెట్టిన తరువాత పూజరిగారు ఇచ్చే కొబ్బరి చిప్ప ప్రసాదం మీదే దృష్టి ఉండే సగటు భక్తులకు, కొంచెం పెద్ద చిప్ప దొరికితే అంతే సంతోషిస్తారు అనేది మన అనుభవైక వేద్యమే! ఇక ఈ కోతి ఏమిటో, కొబ్బరి చిప్ప ఏమిటో, ఇక దాన్ని ఏం  చెయ్యొచ్చో రమ్యం గా వివరిస్తున్నారు శ్రీమతి పద్మా రఘునాద్!

రమణ బంధకవి


సంపాదకుడు



కోతికి కొబ్బరి ఛిప్ప దొరికితే!


శ్రీమతి పద్మా రఘునాద్



కోతులను చూసినా కొబ్బరి చిప్పలను చూసినా ఆనందించని వారు ఎవరుంటారు చెప్పండి ఎంత నవ్వు రానివారికైనా కోతి చేష్టలను చూస్తే యిట్టే నవ్వు రాకుండా ఉండదు మరి. కుప్పిగెంతులు పెడుతూ చెంగు చెంగున ఈ చెట్టు మీదనుండి ఆ చెట్టు మీదకి ఉయ్యాలలూగే కోతులను చూస్తే ఎవరికైనా మనస్సు తేలికగా అవ్వక మానదు. అలాగే వాటికి కొబ్బరి చిప్పలు కుడా చాలా ప్రీతి పాత్రమని అందరికి తెలిసినదే. 

ఇక వాటికి ఆ కొబ్బరి ఛిప్పలు దొరికితే ఎంత సంతోషమో మరి. వాటి ఆనందానికి ఇక హద్దులే ఉండవు. మా చిన్నతనం లో మా ఇంటి కప్పుమీదకి కోతుల గుంపులు  వచ్చి కుర్చునేవి. అందులో కొన్ని మా వంటింటి వసారాలోకి కూడా వచ్చేవి. మేము భయంతో తలుపులన్నీ మూసి కిటికిలోంచి చూస్తుండే వాళ్ళం. మా అమ్మ గారు ఆంజనేయ భక్తురాలు కావటం వలన దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్ప, కిటికీ లోంచి వసారాలోకి వేసేవారు. పైగా కోతులు మంగళవారం వచ్చేవండోయ్! మేము చాల కుతూహలం గా కిటికిలోంచి అవి కొబ్బరి చిప్పలని కొరుక్కు తింటూ ఉంటే ఆసక్తి గా చూసేవాళ్ళం. అపుడపుడు అప్పాలు కూడా వేసేవారు. అవి తినటం అయ్యాక కొంచెం సేపటికి వెళ్లి పోయేవి. ఎవరికైనా సరే కోతులు కోతి  చేష్టలు చేస్తుంటే చూడటం చాల సరదాగా ఉంటుంది మరి

కొబ్బరి చిప్ప దొరికితే కోతులకి ఎంత ఆనందమో, మనకి కూడా అంతే! అతి ఇష్టమైన ప్రియమైన వస్తువు దొరికితే మన ఆనందానికి కూడా పట్ట పగ్గాలు ఉండవు కదా! ఆ ఆనందాన్ని వెలి బుచ్చటానికి ఎగురుతాము, గెంతుతాము, డాన్సు కూడా చేస్తామేమో మరి. 

ఎవరికైనా ఒక్కోసారి అనుకోకుండగా ఏదైనా అపురూపమైనది దొరికితే  వారికి ఇంక వేరే ధ్యాస ఉండక దానిలో మునిగి పోయే పరిస్థితి అపుడపుడు ఏర్పడుతూ ఉంటుంది. వారికి ఇక ఆ వస్తువే లోకం గా ఉంటూ ఇంక వేరే పరిస్థితులు, పరిసరాలు పట్టకుండగా ఉంటారు. పెద్దలు వారిని "చూడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది వాడి పరిస్థితి" అని అనటం మనం వింటూనే ఉంటాము. ఆ వస్తువు పైన ఉన్న మమకారం, మోహం, వ్యామోహాల వలన అలాంటి పరిస్థితి సంభవించ వచ్చు. బహుశ పెద్దలు ఈ అర్ధం లో దానిని వాడి ఉండచ్చు.  లేదా ఒక్కోసారి అర్హత లేనివారికి అకస్మాత్తు గా అధికారం లాంటివి దొరికినా దానిని సరిగ్గా వినియోగించుకోలేక దుర్వినియోగ పరిచే పరిస్థితిని కూడా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అని చెప్పటం మరొక ఉద్దేశ్యం కావచ్చు. 

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే వెంటనే అది రుచికరం గా ఉన్న కొబ్బరిని అంత కొరికేసి తినేస్తుంది. కాని మనకి కొబ్బరి చిప్ప దొరికితే మనం బోల్డు పదార్ధాలు చేసుకోవచ్చు మరి. 
ఒకవేళ గుళ్ళో పూజారి కొబ్బరి చిప్పని  ప్రసాదంగా ఇస్తే,  వెంటనే మనస్సులో ఎన్ని రకాల వంటకాలు మెదలుతాయి ఆ కొబ్బరి చిప్పతో ఇంటికెళ్ళగానే  ఏమిచేసుకున్దామా అని అటు ప్రసాదాల దగ్గరనుండి, పచ్చళ్ళ దాక, ఎన్నెన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. 

కొబ్బరిని చిన్న  ముక్కలు  గా చేసి  వడపప్పు, అరటి పండు ముక్కలతో  కలిపితే అదే ఒక గొప్ప ప్రసాదం. పెసరపప్పు పరమాన్నం లో కూడా కొబ్బరిని కోరుని కలిపి కొబ్బరి పెసరపప్పు పాయసం చేసుకోవచ్చు. చక్రపొంగలి లో కూడా కొబ్బరి ముక్కలు వేసుకునే పధ్ధతి మరొకటి.  చనివిడి తింటున్నపుడు నోటికి తగేలే కొబ్బరి ముక్కల రుచి చెప్పటం సాధ్యమా కొబ్బరితో చాలా  సాధారణంగా చేసుకునే అతి మదురమయిన తీపి వంటకం మన కొబ్బరి లౌజును మరవద్దు సుమా! పంచదార, బెల్లం  రెండిటి తో  కూడా దీనిని చేసుకోవచ్చు. అదేకాకుండగా రవ్వలడ్డు చేయటానికి కూడా నూకలో ఈ కొబ్బరి కోరును కలపాల్సిందే మరి! 

ఇవేకాకుండగా, కొబ్బరిని  కోరుకుని దానితో రకరకాల కొబ్బరి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. వట్టి కొబ్బరి పచ్చడి, కొబ్బరి-మామిడి పచ్చడి, కొంచెం టొమాటోలు కలిపి కొబ్బరి-టమాటో పచ్చడి, కొబ్బరి నిమ్మరసం పచ్చడి ఇలా రకరకాలు. వీటన్నిటిలో దండిగా పోపు, పచ్చి మిరపకాయలు మాత్రం తగిన పాళ్ళలో పడితే మరింత రుచి. కొబ్బరికోరుతో కొబ్బరన్నం నిమ్మరసం పిండుకుని చేసుకోవచ్చు. అలాగే చిక్కుడు కాయ, దొండకాయ, అరటికాయ కూరలలో కొబ్బరి కోరు కలిపి కూరలను మరింత పసందుగా చేసుకోవచ్చు. ఆఖరుకి అటుకులు వేయించుకుని అందులో కొబ్బరి కోరుని కలుపుకుని తింటే కూడా చాల బాగుంటుందని వేరే చెప్పక్కర్లేదు. 

ఈ పైన చెప్పుకున్నవన్ని అందరకు తెలిసినవే, మరొక్క మారు గుర్తుకు తెచ్చుకున్నాం! 
కాని కొబ్బరి తో బూరెలు, బిస్కట్లు కూడా చేసుకుంటే చాల బాగుంటాయి, తెలుసాఎలా చేసుకోవచ్చో క్లుప్తంగా తెలుసుకుందామా?

ఒక గ్లాసు మైదా పిండి కాని, గోధుమ  పిండి కాని తీసుకుని, దానిలో అర గ్లాసు కొబ్బరి కోరు, ముప్పావు గ్లాసు పంచదార, కొంచెం ఏలకుల పొడి కలిపి, రెండు మూడు చెంచాల నేయి వేసి చపాతీ పిండి లాగ గట్టిగా కలిపి అరగంట నానాక , పలచటి చపాతీ లాగా వత్తి బిళ్లలుగా కాని, డైమండ్ ఆకృతి లో కాని కోసి నునె లో వేయించుకుని తింటే చాల బాగుంటాయి. పిల్లలకు కూడా ఇష్టం గా ఉంటాయి. 

ఆ... మాకు అంత సమయం ఓపిక ఎక్కడది? అని అనుకుంటే సుబ్బరంగా లేత కొబ్బరిని వట్టినే తింటే కూడా ఎంతో బాగుంటుంది. అందులో కొంచెం పంచదార కాని, చిన్న బెల్లం ముక్క కొరుక్కుని తింటే ఇంకా బాగుంటుంది.  మరి ఇన్ని రకాల వంటకాలు ఒక్క కొబ్బరి చిప్పతో చేసుకోవటం ఎంత ఆనందదాయకం చెప్పండి

కొబ్బరి చిప్పని చూస్తే మనకే ఇంత సంతోషం, ఇక కోతుల విషయం వేరే చెప్పాలా








No comments:

Post a Comment