శ్రీమతి రత్నా శ్రీనివాస్
(జరిగిన కధ: దారి మద్యలో కారు ఆపుకుని మంచిగా చెక్కు కట్టిన బియ్యపు పిండి రొట్టి
ఆవకాయ బద్దతో సుబ్బరంగా నంజుకుని తిని ఫ్లాస్కులో తెచ్చుకున్న వేడి కాఫీ సేవించి
చెన్నై ప్రయాణమయ్యారు మన కామాక్షి కుటుంభం. ఇక చూద్దాం ఏమవుతుందో!)
సరిగ్గా భోజనాల వేళ అవుతుండగా ఆమ్మలు ఇంటికి
జేరేరు. అమ్మలు, కూతురు చిన్నారి వీళ్ళ రాక కోసం గేటు వద్దనే ఎదురు చూస్తూ
వున్నారు. అమ్మలు సాదరంగా ఆహ్వానించింది. అత్తగారు, మనవరాలి చేయి పట్టుకుని నిరుడు
కన్నా బాగా పొడవయ్యావే! అన్నారు. చిన్నారి “తాత! నువ్వు బాగా ముసలి అయిపోయావు” అంది దగ్గరకొచ్చి గట్టిగా.
చిన్నారి పట్టాభి కన్నా వయసులో మూడేళ్ళు పెద్దది. “నేను పళ్ళు పెట్టుకోలేదే! అందువల్ల ముసలిగా
వున్నాను” అన్నారు లక్ష్మీ కాంతం గారు
చెవి మిషను సర్దుకుంటూ.
వియ్యాల వారితో పలకరింపులు, ఉభయ కుశలోపరి అయ్యేక
అమ్మలు అందరికి భోజనాలు వడ్డించింది. వాళ్ళ తోటలో కాసిన మామిడి కాయతో పప్పు,
గుత్తి వంకాయ కూర చేసింది. కొత్త ఆవకాయ రుచి చూడండంటూ ఆవ ఘాటుతో ఘుమఘుమ లాడుతున్న
యెర్రని ఆవకాయ తెచ్చిపెట్టింది. దానితో పాటు ఇంత వెన్న ముద్ద కూడా తెచ్చింది.
లక్ష్మి కాంతం గారి కోసం మిరియాల చారు పెట్టింది. అందరు ఆవురావురమని తిన్నారు. విశ్వనాథం
అమ్మలు వంటను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇలాంటి భోజనం జీవితంలో ఒక్కసారి తిన్నా
చాలు, పది జన్మలు గుర్తుండి పోతుందన్నాడు.
ఆడపడుచు అమ్మలుది చాల మంచి మనస్సు. నాలుగు
పదార్ధాలు చేసిందని కాదు. ఎప్పుడు నవ్వుతూ వుంటుంది. ధృడమైన మనస్తత్వం. ఎటువంటి
పరిస్థితులలోను నిబ్బరాన్ని కోల్పోదు. సహనశీలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులకు
స్పూర్తిదాయకంగా వుంటుంది. కలవారింటికి కోడలుగా వెళ్ళింది. అత్తవారికి బోలెడన్ని ఆస్తులు,
తోటలు వున్నాయి. అన్నిటికి మించి అమ్మలుకున్న పెద్ద ఆస్తి చెక్కు చెదరని
చిరునవ్వు. కామాక్షి, అమ్మలును చూసి ఎంతో నేర్చుకోవాలి అనుకున్న సందర్భాలు లేకపోలేదు.
భోజానాలయ్యేక ఇద్దరి అత్త మామలు కునుకు తీస్తున్నారు. విశ్వనాథం
ఉదయమే లేచి డ్రైవింగ్ చేసిన అలసటి మీద కమ్మని భోజనం తిన్నాడేమో హాలులోనే ఒక ప్రక్క
పడుకుని గురక పెట్టి నిద్రపోతున్నాడు. చిన్నారి,
పట్టాభి, అమ్మలు వాళ్ళ ఆయన వైకుంటపాళీ
ఆడుతున్నారు. పిల్లలు, విశ్వనాథం ఉండుండి పెట్టే వింత గురక శబ్దాలకి మధ్యలో ఆట
ఆపి పకపక నవ్వుతున్నారు. అమ్మలు,
కామాక్షికి, తమ పెరట్లో వేసిన అరటి గెలను చూపిస్తోంది.
రామేశ్వరం వెళ్ళాల్సిన రైలు మరునాడు
సాయంత్రానికే. కాఫీలు అయ్యేక అందరం బజారు
వెళ్లి వద్దామంది అమ్మలు. అత్తగారు, అమ్మలు కుటుంబానికి బట్టలు కొన్నారు.
చిన్నారికి తన కాసికాయ గుళ్ళ గొలుసు తీసి మెడలో
వేస్తూ నా గుర్తుగా వుంచుకోవే అన్నారు. అమ్మలు కూడా అందరికి బట్టలు కొంది. పిల్లలకి ఐస్ క్రీం
పెట్టించింది. కపాలేశ్వర స్వామి కోవెలకి, అష్టలక్ష్మి గుడికి వెళ్లి చీకటి
పడుతుండగా ఇంటికి వచ్చేశారు.
శనివారం కావటంతో రాత్రికి అందరికి, అమ్మలు ఉప్పిడి పిండి ఫలహారం
చేసింది. పెసర పప్పు వేసి కమ్మగా పొడిపొడి
లాడుతూ చేసింది. నంచుకోవటానికి దోసావకాయ వేసింది. కామాక్షి అమ్మలుకి పనిలో సహాయ
పడుదామనుకున్నా, అమ్మలు అత్తగారికి భయపడి వంట ఇంటిలోకే వెళ్ళలేదు. ఆవిడకి నిప్పులు
కడుక్కునేంత ఆచారం. పొరపాటున ఏ గిన్నె ముట్టుకున్నా ఆ రోజు ఆవిడకి ఎకాదశే!
ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకే రామేశ్వరం
ప్రయాణం. అత్తగారు ఎపుడో కాశి వెళ్ళినపుడు తెచ్చుకున్న సీలు వేసిన గంగ చెంబు
మర్చిపోకుండా పెట్టెలో పెట్టుకుని తెచ్చుకున్నారు. కాశి లోని గంగ నీరుతో
రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయిస్తే మంచిదట. అందుకని ఇన్నాళ్ళు దాచి ఉంచేరు.
అమ్మలు అత్తగారు రామేశ్వరంలో హుండిలో వేయమని 101 రూపాయిలు ఇచ్చేరు. స్టేషన్ దూరం
అవటం చేత మధ్యాహ్నం భోజనాలు కాగానే బయలుదేరేరు. రైలు ప్రయాణం బాగానే సాగింది.
లక్ష్మీ కాంతం గారు “అమ్మలు అత్తగారు మునుపటి కన్నా ఆచారాలు కొంచెం
సడలిన్చుకున్నట్లున్నారే “? అన్నారు.
“ఏమి చేస్తారు? ఆయన మంచం పట్టటం, ఈవిడకి చూపు
మందగించటం ఒక్కసారే వచ్చిపడ్డయాయే! ఆవిడ దాకా ఎందుకు? మనం సడలించుకోలేదు?” అన్నారు
అత్తగారు.
నిజమే! అత్తగారు కాలానుగుణంగా మారేరు. తరతరాలుగా
వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కొంతమేరకు సడలించుకున్నారు తమ ఆచారాలు పిల్లలకి
ఇబ్బంది కాకూడదని.
రాత్రి భోజనంలోకి అమ్మలు కట్టిచ్చిన ఫలహారం
తిని, మరచెంబులో పోసి ఇచ్చిన నిమ్మకాయ మజ్జిగను తలా కొంచెం తాగేరు. మరునాడు ఉదయమే
రామేశ్వరం చేరుకున్నారు. వున్న వాటిల్లో ఒక మంచి హోటల్ లో బస చేసేరు. స్నానాలు
చేసి కాఫీ తాగి దేవుడి దర్శనానికి
బయలుదేరేరు. (సశేషం)
No comments:
Post a Comment