ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి
నమ్మ వాయనం!’
శ్రీమతి పద్మా రఘునాద్
పార్ట్ 2
ఇదే సంస్కృతి మన భారత దేశం లో అణువణువునా నిండిపోయి
ఉందని గట్టిగా చెప్పచ్చు. అందునా మన తెలుగువారు పెట్టుపోతలకు ఏ మాత్రం వెనుకంజ వేయరనే
తెలుస్తుంది. అయితే పెట్టేటపుడు, మనం అవతల వారికి ఏదో తక్కువ ఉందని
ఇస్తున్నామని, దానితో వారి అవసరాలు అన్ని గడచి పోతాయని
ఉద్దేశం మనస్సులోకి రాకుండా ఇస్తే మంచిది. అలాగే కొన్ని సాంప్రదాయాలు పాటించ వలసి
వచ్చునపుడు, మనం ఇవ్వకపోయినా వాళ్ళకేమి లోటు లేదు, ఇవ్వటం అనవసరం, దండుగ అని
మాత్రం అనుకుని సాంప్రదాయాన్ని దాటవేసే నెపాన్ని మాత్రం
దగ్గరకు రానివ్వకుండగా చుసుకొవాలి. మనం ఇచ్చేటపుడు ఎంత గౌరవం, సంతోషం కనబరుస్తామో, పుచ్చుకునే టపుడు వారు కూడా
అంతే సంతోషం, గౌరవం కనపరచే అవకాశం ఉన్నది. మనం పెట్టేది మన
సంస్కారాని తెలిపితే, వారు పుచ్చుకునే విధానం వారి
సంస్కారం తెలుపుతుంది సుమండీ!
బంధుమిత్రుల రాకపోకలు, సాంప్రదాయాలు, పెట్టు
పోతలు, ఇచ్చి పుచ్చుకోవటాలు అన్ని సక్రమగా పాటించిన ఇళ్ళల్లో
పెరిగే పిల్లలు కూడా చాల సులభంగా ఈ సంస్కారాలన్ని ఎవరూ కూర్చోపెట్టి నేర్పకుండగానే
సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మన
సంస్కారాలు భావితరాలకి అందజేసి అవి కొన సాగేలాగా చేసే సాధనాలు మన పిల్లలు, సంతానమని అని ఒక
మహానుభావుడు చెప్పిన మాట ఎంతో నిజమనిపిస్తుంది.
ఈ ఇచ్చి పుచ్చుకునే ఆచార వ్యవహారాలని గమనించినట్లయితే, మన సంస్కృతి మనకు వీలయినంతలో ఎపుడూ అందరికి ఏదో సందర్భం లో ఇవ్వమనే చెప్తుంది. అవి పండగలు, పబ్బాలు కానివ్వండి, వేడుకలు
శుభకార్యాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు పేరంటాలు కానివ్వండి,
నోములు వ్రతాలు కానివ్వండి, పూజలు పునస్కారాలు
కూడా కానివ్వండి. ఇలాంటి ఏ సందర్భమయినా తమ తృప్తి, ఆనందం వ్యక్తీకరించటానికి ఈ కానుకలను ఇవ్వటం అనే ఆచారం అలవాటుగా వస్తోంది.
ఈ "ఇవ్వటం"మన బంధు మిత్ర వర్గానికి మాత్రమే పరిమితం కాకుండగా అవసరం
లో ఉన్నవారిని ఆదుకోవటానికి, కష్టాలలో ఉన్నవారికి చేయూత
అందించటానికి, నిస్సహాయులకు సహాయరూపంలో, మన శక్తి కొలది అందజేయటం కరుణ తో కూడిన దాన, ధర్మ గుణం గా పిలువబడుతోంది.
ఈ గుణాలకి ఇచ్చిన ప్రాముఖ్యత చూస్తుంటే, ఇచ్చే వారికి మాత్రమే పుచ్చుకునే అర్హత కూడా
వస్తుందని చెప్పకనే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ జన్మ లో ఇచ్చిన దాన ధర్మాల
అనుగుణం గానే మరు జన్మలు వస్తాయని మన సనాతన ధర్మం చెప్తోంది. అందుకనే ' పెట్టి పుట్టారు'
దేనికైనా "పెట్టి పుట్టాలి" అనే
వాడుక పదాలని అడపా దడపా మనం వింటూనే ఉంటాము. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, పెట్టేటపుడు అటు శక్తి కి మించి
పెట్టరాదు; అలాగే శక్తి ఉన్నా కూడా లోభం చుపించరాదని పెద్దలు మనల్ని హెచ్చరిస్తారు కూడా.
మొత్తానికి ఈ ‘ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!’ లో ఎన్ని మర్మాలున్నాయో తెలుసుకున్నాం కదా! ఇక
మనం ఈ సంప్రదాయాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, మన తరువాతి తరాలకు కూడా అందించుదాం!