ముందుమాట:
దీపారాధనకు ప్రత్తి తో చేసిన వత్తులే
వాడతారు. ఈ రోజుల్లో ఎవరైనా ఈ వత్తులు ఏదైనా షాప్ కి
వెళ్ళినప్పుడు కొనటం కద్దు. కాని
మా చిన్నతనం లో ప్రతి ఇంట ఈ వత్తులు చేసుకునే వారు. మా
ఇంటి పక్కన పెద్ద అరుగుల
ఇల్లు కిష్టమ్మ గారు అపరాహ్నం వేళ అంత ప్రత్తి ముందు వేసుకుని
వత్తులు చేస్తూ
ఉండేవారు. నేను, మా అక్కగారు బడి నుండి వచ్చాక ఆవిడ దగ్గర కూర్చునే
వాళ్ళం. ఆవిడ
మాకు కూడా కొంత ప్రత్తి ఇచ్చి వత్తులు చేయమనే వారు. పద్ధతి ఆవిడ చూపితే,
మేము మాకు
వచ్చిన రీతిలో బుజ్జి బుజ్జి వత్తులు చేసే వాళ్ళం. తరువాత మాకు కొద్దిగా
మరమరాలు
చేతిలో పోసేది. ఆ రోజులు ఇంకా బాగా జ్ఞాపకం. మన పాఠకులు కొందరు వ్రత్తులు
చేసే పద్ధతి, విధి
విధానాలు ఏమైనా ఉన్నాయా అని అడగటం జరిగింది. అందుకొరకు ఈ వ్యాసం
మీ ముందుకు
తెస్తున్నాం.
రమణ బంధకవి
సంపాదకుడు
దీపారాధన : ప్రత్తి వత్తులు - విధి విదానాలు!
శ్రీమతి నయన కస్తూరి
కార్తీకమాసం లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని
నిన్నటి వ్యాసం లో చెప్పుకున్నాము. దీపం ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపమే అనుకోండీ!
నిత్యం ఇంట్లో దీపం వెలగాలి. ఏ పండుగైనా శుభకార్యమైనా దీప జ్యోతిని
ప్రజ్వరిల్లించిన పిదపే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మనం దీపారాధనకు ఎటువంటి వత్తులు
వాడాలి; వాటిని దేనితో తయారు
చేసుకోవాలి; వాటిని ఎలా తయారు
చేసుకోవాలి; వాటిని ఏయే రోజుల్లో
ఏయే వేళల్లో చేయాలో ఏయే ఆకారాల్లో చేసుకోవచ్చో
క్లుప్తంగా తెలుసుకుందామా మరి?
శుభ్రమైన ప్రత్తి తో చేసిన వత్తులు
దేవుని దీపారాధనకు ఉత్తమం! ఇదివరకైతే మన అమ్మమ్మల, బామ్మల మధ్యాహ్న కాలక్షేపం వత్తులు చేసుకోవడమే! మరి ఇప్పుడో? హడావిడి జీవితాల పరుగులాట లో వత్తులు చేసుకునే సమయం,
ఓపిక, ఆసక్తి ఎక్కడ? అందువలన అన్నీ రెడీమేడ్ గా దొరికేవి కొని తెచ్చేసుకుంటున్నాం. 'భోజనం లోకి కూరలే కర్రీ పాయింట్ల నుండి
తెచ్చుకుంటుంటే ఇక వత్తుల్ని కూడా ఎవరు చేసుకుంటారండీ బాబూ?' అని అనబోతున్నారా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం
ఆలకిస్తే, 'మేము కూడా
ఇక నుండి ఖాళీ సమయాల్లో స్వయం గా మా హస్తాలతో వత్తుల్ని చేసుకుని, దేవునికి దీపారాధన చేసుకోడానికి తప్పక ప్రయత్నిస్తాం' అని అనక మానరు.
ఇంటి భోజనానికి, హోటల్ తిండికి ఎంత వ్యత్యాసం వుంటుందో మీ జిహ్వే చెప్తుంది కదా? మీరు స్వయం గా ఆప్యాయతానురాగాలతో వండి, మీ కుటుంబాని కి ప్రేమగా వడ్డిస్తుంటే
వారు తృప్తి గా తింటూ వుంటే, మీకు ఏమీ
తినకుండానే ఆనందం తో కడుపు నిండి పోదూ? అలాగే మీరు చేసిన వత్తులతో దీపం
వెలిగించి, మీ ఇంటి
చెట్టు కు పూసిన పూలను కోసుకుని వచ్చి, మనలను అనుక్షణం కాపాడే ఆ దైవానికి అర్పిస్తే మన మనసు అలౌకికానందానికి లోను
కాక తప్పదు. ఆ ఆనందం అనిర్విచనమైనది. అది ఎవరికీ వారే అనుభవించి తీరాలి.
అయితే మరి ఇక చూడండి వత్తులు ఎలా
చేసుకోవాలో! ఎప్పుడూ స్నానం
చేసిన తర్వాత మాత్రమే వత్తులు చెసుకొవాలి. దైవ కార్యానికి వినియోగించేవి కనుక భక్తి శ్రద్ధలతో
చేసుకోవాలి. ముందుగా గింజలను తీసుకుని, ప్రత్తిని శుభ్రపరుచుకోవాలి. పవిత్రమైన
విభూది కూడా దగ్గర పెట్టుకోండి . ప్రత్తిని కొంచెం కొంచెం గా ఎడం చేతి తో
పట్టుకుని, కుడి చేతి బొటన వేలుకి, మధ్యవేలు, ఉంగరం వేలుకి విభూధిని బాగా రాసుకుని,ఎడమ చేతిలోని ప్రత్తిని తాడులాగా
లాగుతూ,మూడు
పొరలుగా వ్రేళ్ళకు చుట్టుకుని, మనం ప్రమిద సైజ్ ను బట్టి వత్తులుగా
చేసుకోవాలి. వత్తులు చేసుకుంటున్నప్పుడు చేతులను శుచిగా ఉంచుకోవాలి. మధ్యలో ఏదైనా
పనికోసం లేచి వెళ్ళి వస్తే కాళ్ళూ చేతులను కడుగుకుని మళ్ళీ ప్రారంభించాలి. మౌనం
గా కూర్చుని చేసుకుంటే మంచిది.
మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం
ఏమిటంటే వత్తుల్ని ఆది, బుధ, గురు వారాల్లో మాత్రమే చేసుకోవచ్చు.
సోమ, మంగళ, శుక్ర, శని
వారాలు వత్తులు చేసుకోవడానికి నిషిద్దం అని పెద్దలు చెప్తారు. ఆ రోజుల్లో ప్రత్తి
విత్తులను ఏరి పారేయకూడదు అంటారు. ఆ రోజుల్లో ప్రత్తిని కొనుక్కోకూడదని కూడా
చెప్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాకా వత్తులు చేసుకోకూడదు. పెద్దలు ఏమి చెప్పినా ఎందుకలా చెప్పారో
వివరంగా తెలియక పోయినా మన మంచికే చెప్తారు అనే నమ్ముతాను నేనైతే!
వత్తుల్లో ఇక మూడు పోగుల వత్తులు, పువ్వు వత్తులు, కమలం వత్తులు వుంటాయి. పువ్వు వత్తులు
చిన్న ప్రత్తి ఉండను తీసుకుని, పై భాగం లో కొంచెం వత్తిని పైకి లాగి చిన్న వత్తు ల్లాగా చేత్తో నలుపుతారు. కింద భాగం ఉండ లాగా ఉండి ప్రమిదలో బాగా నిలబడుతుంది.
దీపం మధ్యలో నిలబడాలను కున్నప్పుడు, ముఖ్యం గా అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ
దీపాలు వెలిగించేటప్పుడు, కార్తీక
మాసం లో ఉసిరిక దీపాలు వెలిగించేటప్పుడు పువ్వు వత్తులు వాడతారు. ఇక కమలం వత్తులు కింద భాగం ఉండలాగా ఉండి, పైన మాత్రం అయిదు వత్తుల్లాగా
చేసుకోవాలి. వారి వారి గురువుగార్ల సలహా మీద కొన్ని కొన్ని ప్రత్యేక పరిష్కారాల
కోసం కమలం వత్తులను వినియోగిస్తారు.
మనం ఇంట్లో చేత్తో చేసుకునే వత్తులు మెలిక తిరిగి నూనె ను
తక్కువగా పీల్చుకుని, ఎక్కువ
సేపు వెలుగుతాయి. బజార్లో కొన్నవి లావుగా ఉండి, ఎక్కువ సేపు వెలుగునివ్వవు. నూనె కూడా
వృధా అవుతుంది. పైగా అన్ని నిత్యావసర వస్తువుల్లాగానే వత్తుల ధరలు కూడా ఆకాశంలోనే
వున్నాయని మీకూ తెలిసిన విషయమే కదా? మనం ఇంట్లో చేసుకుంటే వస్తువూ
బాగుంటుంది, తక్కువ ధరలోనూ దొరుకుతుంది, మనసుకి తృప్తీ కలుగుతుంది. అందుకని దేవుని కోసం చేసే దీపారాధనకు
మనం స్వయంగా పవిత్ర భావం తో వత్తులను చేసుకుంటే పుణ్యం, పురుషార్ధం రెండూ పొందవచ్చుకదండీ?
స్వస్తి!